R Krishnaiah | కాచిగూడ, ఏప్రిల్ 29: బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుండా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. రాష్ట్రం అగ్నిగుండలా మారుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కోసం భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన 15 బీసీ సంఘాలతో మంగళవారం కాచిగూడ అభినందన హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశంలో అధిక శాతం బీసీలు ఉన్నారని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ వాదం బలంగా ఉందని తెలిపారు. అందుకే రాజ్యాంగాన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం పెంచాలని, అందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి, చట్టం చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రానున్న కాలం బీసీలదే రాజ్యమేనని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు రాజ్యాధికార దిశగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.