రామంతాపూర్,అక్టోబర్ 23 : కాంగ్రెస్ను గెలిపించిన ఖర్మానికి పేద ప్రజల కంటికి కునుకు లేకుండా చేస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) విమర్శించారు. బుధవారం రామంతాపూర్ బాలకృష్ణానగర్ మూసీ పరివాహాక(Moosi river) ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ నది పక్కన 30 ఏండ్లుగా నివాసముంటున్న పేద ప్రజల ఇండ్లు కూల గొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు డీపీఆర్ సిద్ధం చేయలేదన్నారు.
శనివారం, ఆదివారం వస్తే పేద ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. నోరు విప్పితే చాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు తప్పా ఒక్కటి కూడా నిజం మాట్లాడం లేదన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలన మీద దృష్టి సారించాలన్నారు. కూల గొట్టుడు, డబ్బులు వసూల్ చేసుడు బంద్ చేయాలని పేర్కొన్నారు. పేద ప్రజలు ఉసురు మంచిది కాదన్నారు. పేదలకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు కొనసాగించాలన్నారు. పేద ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు.