సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో ఎట్టకేలకు జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీలో కదలిక వచ్చింది. విలీన నేపథ్యంలో ‘బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఇస్తలేరు’..‘మ్యాపింగ్ లేదు.. లాగిన్లు ఇవ్వరు’ అన్న శీర్షికతో ఈ నెల 25న నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రత్యేక కథనం వచ్చింది. మ్యాపింగ్ లేని కారణంగా నెలన్నర రోజులుగా దాదాపు 35వేల జనన, మరణ ధ్రువీకరణపత్రాల దరఖాస్తులు నిలిచిపోయాయి. ఈ కథనంపై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలతో పాటు 300 వార్డుల మ్యాపింగ్‌ను కచ్చితంగా పూర్తి చేసి..
జనన, మరణ సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను విజయవంతంగా ఆదివారం నుంచి ప్రారంభించినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిదిలోని 27 పురపాలికల విలీనంతో పాటు వార్డుల సంఖ్యను 150 నుంచి 300కి, సర్కిళ్లను 30 నుంచి 60కి, జోన్లను ఆరు నుంచి 12కి పెంచిన నేపథ్యంలో జనన-మరణాల నమోదు, జారీ వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ సరికొత్త వ్యవస్థతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నమోదు, జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారనుందన్నారు.