ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 21: రాష్ట్రంలోని నిరుద్యోగుల డిమాండ్లను తక్షణమే 48 గంటల్లో పరిష్కరించి న్యాయం చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్, ఓయూజేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్ష(Hunger strike) చేపడతామని హెచ్చరించరు. నిరుద్యోగుల సమస్యలపై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మోతీలాల్నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress) అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించలేదని మండిపడ్డారు.
గ్రూప్ వన్ మెయిన్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను రెండు వేలకు, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను మూడు వేలకు పెంచాలని అన్నారు. గురుకుల పోస్టుల రీలింక్విష్మెంట్ చేయాలని కోరారు. మెగా డీఎస్సీ ప్రకటించి, పోస్టుల సంఖ్యను పెంచాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది విద్యార్థి, నిరుద్యోగులేనని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నిరుద్యోగులను మోసం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.