ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో దోమల నివారణ చర్యలు ప్రహసనంగా మారాయి. ఫాగింగ్ పేరుతో ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం డీజిల్ రూపంలో గాల్లో కలిసిపోతున్నా..దోమల జోరు మాత్రం తగ్గడం లేదు. దోమలు డీజిల్ తాగుతున్నాయో లేక అధికారులు నిధులను మింగేస్తున్నారో అర్థం కానీ పరిస్థితి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువవ్వడంతో అవినీతి అక్రమాలకు అస్కారం ఏర్పడుతోందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుమతిలేకుండా విధులకు గైర్హాజరైనారనే కారణంతో 12 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని సస్పెన్షన్ చేస్తూ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఏప్రిల్ మొదటివారంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిని సస్పెన్షన్ చేయడం చర్చకు దారితీసింది. ఇంతమంది సిబ్బంది సుధీర్ఘకాలంగా విధులకు హాజరుకావడంలేదంటూ ఉత్తర్వులు జారీ చేసి, సస్పెండ్ చేసిన అధికారులు, వాటికి గల కారణాలపై గోప్యంగా ఉంచారు. చాలా రోజులుగా విధులకు హాజరుకాకుండా ఉంటే పర్యవేక్షణ చేసే అధికారులు ఏం చేస్తున్నారో తెలియడంలేదు. అయితే చాలా రోజులుగా ఫాగింగ్ సిబ్బంది విధులకు హాజరుకాని పక్షంలో ఆయా ప్రాంతాలలో ఫాగింగ్ చేశారా… లేదా… బిల్లులు మంజూరు చేశారా… అనేది ప్రశ్నార్థకంగా మారింది. సంబంధిత రోజుల్లో అసలు ఫాగింగ్ చేపట్టారా… లేదా… ఇలా వదిలివేయడంతో కాలనీలలో ప్రజలు దోమల వ్యాప్తితో ఇబ్బందులు పడితే.. ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియడంలేదు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది సస్పెన్షన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సస్పెండ్ చేసిన కొంతమందిని ఇటీవల మళ్లీ విధుల్లోకి తీసుకోవడం కొసమెరుపు.
సిటీబ్యూరో/మల్కాజిగిరి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ) : మల్కాజిగిరి జోనల్ పరిధిలోని మున్సిపల్ పరిధిలో జరిగిన ఫాగింగ్ విభాగంలో జరిగిన విషయాలను గోప్యంగా ఉంచారు. గతంలో డిజిల్ విషయంలో అవకతవకలు జరిగాయని, ఫాగింగ్ చేయకుండా బిల్లులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇదంతా అధికారులకు తెలిసే జరిగినట్లు, వాటిలో వీరికి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనితో ఔట్సోర్సింగ్ సిబ్బంది సస్పెన్షన్, అధికారుల సెలవులు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఔట్సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు, పర్యవేక్షించే అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అయితే ఈ విషయంలోనే సంబంధం కలిగిన అధికారులు సెలవులు పెట్టడం, బదిలీపై వెళ్లారని చర్చకొనసాగుతుంది.
అరకొర సిబ్బందితోనే ఫాగింగ్ పనులు
మల్కాజిగిరి, మౌలాలి సర్కిల్ పరిధిలో ఫాగింగ్ ప్రక్రియ అరకొర సిబ్బందితోనే కొనసాగిస్తున్నారు. సిబ్బందిని సస్పెండ్ చేసిన అధికారులు, వారి స్థానాల్లో సిబ్బందిని నియమించకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. పనుల్లో పారదర్శకత లోపిస్తున్నది. ఆయా ప్రాంతాలలో ఫాగింగ్ పనులు ప్రశ్నార్థ్ధకమవుతున్నాయి. మౌలాలి, మల్కాజిగిరి సర్కిల్స్ పరిధిలో ఆయా ప్రాంతాల వారీగా వార్డులకు తగిన విధంగా సిబ్బందిని, పర్యవేక్షకులు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం వాటికి తగిన సిబ్బంది పనిచేయడంలేదని తెలుస్తున్నది. దీనితో ఫాగింగ్ పనులు పూర్తిస్థాయిలో జరుగడంలేదనే చర్చ కొనసాగుతున్నది. గతంలో ఒక్కో వార్డుకు 18 మంది సిబ్బంది ఉండగా, ప్రస్తుతం 9 మంది పనిచేస్తుండగా, ఫాగింగ్ మిషన్లు రెండు మాత్రమే పనిచేస్తుండగా 4 గురు సిబ్బంది సేవలు అందిస్తున్నారు. రెండు పెద్దయంత్రాలు రిపేర్లు చేయకపోవడంతో పనిచేయడంలేదు. అన్ని ప్రాంతాలలో ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తున్నది. మల్కాజిగిరి, మౌలాలి సర్కిల్ పరిధిలో మాత్రం 8 నెలలుగా మిషన్లు సేవలు అందించడంలేదు.
విషయం బయటకెలా వచ్చింది..?
మున్సిపల్ సర్కిల్స్ వారీగా ఫాగింగ్ పనులు చేస్తుంటారు. ఫాగింగ్ పనుల కోసం ఒక సూపర్‌వైజర్‌తోపాటు, ఫాగింగ్ యంత్రాలను నడిపే సిబ్బంది, ప్రతి ఇంటికి తిరిగి నీళ్లలో మందులు వేసే సిబ్బంది పనిచేస్తారు. అయితే వీరికి గతంలో ఏఈ, సీనియర్ ఎంటమాలజిస్టు, డీసీలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేది. వీరు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఫాగింగ్ సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో 4 సంవత్సరాలుగా ఫాగింగ్ సూపర్వైజర్గా, సిబ్బందితో పనిచేయిస్తున్న వ్యక్తి 2025 జూలైలో విధుల నుంచి తొలగించారు. ప్రతి రోజు ఇచ్చే డీజిల్‌ను విక్రయించడం, పూర్తి పనిచేయకపోవడం, డీజిల్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును అందరికి వాటాలుఇవ్వడం చేసేవారు. దీనితో పాటుగా యంత్రాల రిపేర్‌కు కూడా డీజిల్‌ను అమ్మకాల ద్వారా పనులు చేసేవారిమని ఫిర్యాదుదారుడు తెలిపారు. ఈ మేరకు ప్రజాభవన్‌లో జరిగిన అవినీతి తీరును వివరిస్తూ , వీడియోలు, ఫోన్‌పేలు, నగదు విక్రయాలు, ఫోన్ రికార్డులతో ఫిర్యాదు చేశాడు.
చెల్లింపులు, పనుల్లో మనస్పర్థలు
డీజిల్ అమ్మకాల్లో కిందిస్థాయి సిబ్బంది మధ్య ఘర్షణ, వాటాల చెల్లింపుల విషయంలో మనస్పర్థలు రావడంతో ఆయా కాంట్రాక్టర్‌ను నిలిపివేశారు. దీనికి తోడు డిజిల్ విక్రయించకుండా కెమికల్ కలపడం చేయడంతో ఆదాయ మార్గం, పనివత్తిడి పెరిగింది. దీనితో కిందిస్థాయి ఉద్యోగి విషయాన్ని వెలుగులోకి తెచ్చాడు. దీనితో పూర్తి అవినీతి విషయం బయటకు వచ్చింది. మళ్లీ అవకాశం ఇస్తామని, కొద్దిరోజులు పనిమానివేయాలని చెప్పి, ఎంతకు తీసుకోకపోవడంతో విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తుంది.
మరీ ప్రస్తుతం వీటిపై పర్యవేక్షణ ఉందా అనేది ప్రశ్నర్ధకమే. అసలు కోట్ల రూపాయాలు దోమల కోసం ఖర్చుచేసే ప్రభుత్వం వాటి అమలులో నిర్లక్ష్యం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరవ్యాప్తంగా దోమలు విజృంభించి విష జ్వరాలతో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రస్తుతం కూడా దాదాపుగా ప్రతి రోజు 40 లీటర్ల డిజిల్‌ను ఇస్తున్నారని, వాటి పర్యవేక్షణ మాత్రం నామమాత్రంగా కొనసాగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. యాంటీ లార్వా ఆపరేషన్ చేసే వర్కర్ల పనిపై పర్యవేక్షణలేదని, పనులు పారదర్శకంగా జరుగనప్పడు, ప్రజాధనం ఎందుకు కేటాయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి.. విజిలెన్స్ తనిఖీలు చేపట్టి అవినీతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.