సిటీబ్యూరో, మే 1(నమస్తే తెలంగాణ): రోజు రోజుకూ మహా నగరం నిప్పుల కుంపటిగా మారుతోంది. ఉదయం 8గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదివారం కూడా స్వల్ప తేడాతో అదే స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రేటర్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.4డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 34 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు నైరుతి దిశ నుంచి వీస్తున్న వేడిగాలులతో వడ గాలులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. మరో పక్క ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.