హైదరాబాద్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తున్నది. గురువారం ఉదయం నుంచి ఆకాశం పూర్తిగా మబ్బులు కమ్ముకున్నది. దీంతో నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాద్, చందానగర్, మల్కాజిగిరి, అంబర్పేట, కాచిగూడ, నల్లకుంట ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. కాగా, బుధవారం రాత్రి నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర తీరం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తూర్పు మధ్యప్రదేశ్ వరకు కొనసాగుతూ సముద్ర మట్టానికి 3.1కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.