చిక్కడపల్లి, జనవరి 3: ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శుక్రవారం ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బీసీ మహాసభ నిర్వహించారు. సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ మహాసభకు వేలాదిగా బీసీలు తరలివచ్చారు. బీసీ నినాదాలతో ధర్నాచౌక్ దద్దరిల్లింది. ఎమ్మెల్సీ కవిత హాజరై సభ వద్ద ఏర్పాటు చేసిన సావిత్రి బాయి పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభను ప్రారంభించారు. దాదాపు 70 కుల సంఘాలకు పైగా నాయకులు హాజరై మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌తో పాటు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తీవ్రంగా మోసం చేసింది. బీసీల పక్షాన ఎమ్మెల్సీ కవిత నిలబడడంతో కాంగ్రెస్ సర్కారుకు భయం పట్టుకున్నది. అందుకే ఈ ధర్నాకు రోజంతా ఉత్కంఠ తర్వాతే రా్రత్రికి పోలీసులు అనుమతి ఇచ్చారు. బీసీల కులాలకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏ ఒక్కటి అమలు చేయలేదు.
-ముఠా జయసింహ, బీసీ సంఘం నేత,
ముదిరాజలును బీసీ-ఏ జాబితాలోకి మారుస్తామని మోసం అన్ని రంగాల్లో వెనబడిపోయిన ముదిరాజులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో బీసీ-డీ గ్రూప్ నుంచి బీసీ -ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చి నేడు మోసం చేసింది. బీసీలకు స్థానిక ఎన్నికల్లో ఇస్తామన్నా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. లేని పక్షంలో మా సత్తా చూపుతాం.
-కోటల యాదగిరి ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు బీసీలకు స్వర్ణయుగమే. కేసీఆర్ పాలనలో ప్రతి కులానికి న్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి బీసీ కులాలంటే చిన్న చూపు..అందుకే బీసీలను పట్టించుకోవడం లేదు.
-విజయ్‌కుమార్ సగర,సగర్ కుల సంఘం నేత
వడ్డెరుల సంక్షేమం కోసం వడ్డెర కార్పొరేషన్ ఇస్తామని హామీ నేటి అమలు చేయలేదు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలను ఓట్లు అడిగే హక్కు లేదు. సీఎం రేవంత్ రెడ్డి స్వలాభం కోసం పాలన కొనసాగిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి.
-ఆలకుంట్ల హరి, వడ్డెర కుల సంఘం నేత