బంజారాహిల్స్, ఆగస్టు 1 : రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి ఇవ్వాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ కోరారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని బంజారాభవన్ జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో కలిసి హాజరైన ఎమ్మెల్సీ దాసోజు రేషన్ కార్డుల మంజూరీలో ఉన్న లోపాలను ఎత్తిచూపారు. ఖైరతాబాద్ సర్కిల్లో 22,399 మంది దరఖాస్తు చేసుకుంటూ కేవలం 1959 మందికి మాత్రమే కార్డులు మంజూరు చేయడం అన్యాయమన్నారు. బహదూర్‌పురా, కార్వన్, జూబ్లీహిల్స్, నాంపల్లి వంటి నియోజకవర్గాల్లో 5వేలకు పైగా కార్డులు ఇచ్చారన్నారు. ఈ వ్యత్యాసానికి కారణాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకున్నారని, అయితే ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మందికి మంజూరు చేశారు.?అనే గణాంకాలు అధికారికంగా విడుదల చేయాలన్నారు.
మంత్రి వాస్తవాలను తెలుసుకోవాలి
కాగా, సభలో గత పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదని ఓ సివిల్ సప్లయి కార్యదర్శి వ్యాఖ్యలు చేయగా, ఎమ్మెల్సీ దాసోజు ఖండించారు. ఓ ఉన్నతాధికారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా మాట్లాడడం సరికాదని, ఆ వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవానికి విరుద్ధమన్నారు. రేషన్ కార్డుల మంజూరీకి సంబంధించిన డేటా ఆన్లైన్లో చూసుకోవాలన్నారు. వెంటనే సదరు అధికారి తన తప్పును తెలుసుకొని సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేయగా, మంత్రి పొన్నం ప్రభాకర్ అంత వివరణ అవసరం లేదంటూ వ్యాఖ్యానించడంతో..ఎమ్మెల్సీ దాసోజు ఘాటుగా స్పందించారు.
ఈ నేపథ్యంలో సభ మొత్తం రసాభాసగా మారింది. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వాస్తవాలను తెలుసుకోవాలని, గత ప్రభుత్వంలో 2016 నుంచి 2023 వరకు 6,45,479 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని, 2014లో 4 కిలోల బియ్యాన్ని ఆరు కిలోలకు పెంచిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు.