దుండిగల్,అక్టోబర్7 : సీఎం రేవంత్‌రెడ్డి నిత్యం ఢిల్లీకి చక్కర్లు కొడుతూ పాలనను గాలికి వదిలేసారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA Vivekanand) విమర్శించారు. షాపూర్‌నగర్‌లోని బాలానగర్-నర్సాపూర్ ప్రధాన రహదారిలో రూ.3.5కోట్ల వ్యయంతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని(Foot over bridge) సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జాతీయ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ తెలంగాణ తొలి సీఏం కేసీఆర్ మార్గదర్శకత్వంలో కేటీఆర్ కోట్లాది రూపాయల నిధులతో నగర వ్యాప్తంగా ఇలాంటి నిర్మాణాలు చేపట్టారన్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రికి హైదరాబాద్ అంటే ‘మూసీ’ మాత్రమే కనపడుతుందని, గడిచిన 10 నెలల్లో సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూలుస్తూ పాలనను గాలికి వదిలేసారని విమర్శించారు. హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితి, నాలాల పరిస్థితి, మురుగునీరు పరిస్థితి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. మహా నగరం అభివృద్ధి కోసం నాడు మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ కోట్ల రూపాయలు వెచ్చించి ఎస్ఎన్డీపీ ,ఎస్ఆర్డీపీ పనులను చేపట్టి నగరంలో భద్రతాపరమైన ఎన్నో చర్యలను చేపట్టి ఎంతో అభివృద్ధి చేశారన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి మున్సిపల్ శాఖను తనవద్దే పెట్టుకోవడం, ఆయన నిత్యం ఢిల్లీకి హైదరాబాద్‌కు తిరుగుతూ రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని మరిచారన్నారు. హైదరాబాద్ నగరానికి నార్త్ సిటీగా ఉన్న కుత్బుల్లాపూర్ ప్రాంతానికి మెట్రోను విస్తరించాలని లేకపోతే మెట్రో సాధన సమితితో కలిసి మెట్రో వచ్చేంతవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.