గోల్నాక, జనవరి 3 : నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రుహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (MLA Venkatesh )తెలిపారు. శుక్రవారం అంబర్ పేట డివిజన్ బాపునగర్ లో రూ.18లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు ఏర్పాటు పనులను స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నియోజవకర్గ వ్యాప్తంగా కొత్తగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
దీంతో పాటు మంచినీటి, డ్రైనేజీ, పార్కుల సుందరీకరణ, కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటు వంటి పనులు విస్తృతంగా చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ, మంచినీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం బాపు నగర్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ క్షేత్ర స్థాయిలో పాదయాత్ర నిర్వహించారు.
ఇంటింటికి తిరుగుతూ ప్రజల యోగ క్షేమాలతో పాటు స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. డ్రైనేజీ సమస్యతో పాటు వెలగని వీధి లైట్లు తదితర సమస్యలు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.