హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీసీ బిల్లు కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాయి ఈశ్వర్‌ను శుక్రవారం గాంధీ హాస్పిటల్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహానికి బీసీ బిడ్డలు ఆవేశాలకు గురై బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు.
అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు నిర్మల్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి మూత్రం తాగిస్తారా? అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పరిధిలో 28 కి 25 గ్రామపంచాయితీలు ఏకగ్రీవం ఎలా అయ్యాయి అని ప్రశ్నించారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలు ఏకమై గద్దె దింపుతామని హెచ్చరించారు. సాయి ఈశ్వర్ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.