హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చరిత్రలో నిలిచిపోయే గొప్ప రోజు నవంబర్ 29 అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ స్థాయి బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం ఎమ్మెల్యే తలసాని అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ ఉద్యమ సారధి కేసీఆర్ నవంబర్ 29 వ తేదీన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజకీయాలలో పెను భూకంపం సృష్టించిందని చెప్పారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గా కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అన్ని పండుగలను ఘనంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపుకున్నామని, మన సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రధాన నినాదంతోనే తెలంగాణ ఉద్యమం మొదలైందని అన్నారు. 1969, 1972 లోనే ఉద్యమం చేపట్టినప్పటికీ 2001 తర్వాతే కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటి నీటిని అందించి గ్రామీణ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించినట్లు చెప్పారు. నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీటి వనరుల అభివృద్ధితో వరిధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేసి 5 రూపాయలకు భోజనం అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ క్యాంటీన్ లు గా పేరు మార్చిందని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలును మరిచి ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి గ్రామపంచాయతీ ఎన్నికలలో కేవలం 17 శాతం స్థానాలు కేటాయించి తీవ్ర మోసం చేసిందని అన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి, పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న వారికి సముచిత గౌరవం కల్పిస్తామని ప్రకటించారు.
29న దీక్షా దివస్
ఈ నెల 29 వ తేదీన తెలంగాణ భవన్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని దీక్షా దివస్ ను పండుగ వాతావరణంలో ఎంతో ఘనంగా జరపనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ పోస్టర్ ను ఆవిష్కరించారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను వివరించే ప్రత్యేక వీడియో ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు. దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేష్, తదితరులు పాల్గొన్నారు.