MLA Sabitha | కందుకూరు, మార్చి 16 : మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మండల ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సూరసాని రాజశేఖర్ రెడ్డి టీఎస్ఐఐసీ నిధుల నుండి కందుకూరు గ్రామం నుండి ఫార్మాసిటీ వరకు రోడ్డు వసతి కోసం మంజూరు చేసిన నిధులు సరిపోవడం లేదని మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబిత మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా పని చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వంతో పోరాడి నిధులు తీసుకువస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రోడ్డు కోసం బీఆర్ఎస్ పార్టీ హాయంలో నిధులు మంజూరు చేశానని, రోడ్డు పూర్తి కావడానికి కావాల్సిన నిధులను మంజూరు చేస్తానని వివరించారు. కెసిఆర్ సహకారంతో ఎంతో అభివృద్ధి చేశాను. తనపై నమ్మకం ఉంచి తిరిగి గెలిపించిన ప్రజలకు కావలసిన సదుపాయాలను కల్పిస్తానని పేర్కొన్నారు. ఎన్నికల వరకు రాజకీయాలు తప్ప ఎన్నికల అనంతరం రాజకీయాలు చేయవద్దని ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని కొలనుగూడ గ్రామం నుండి ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామం వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదర్ల గణేష్, గొరికల బీరప్ప, బండ వేణు, మస్కు మహేష్‌లు కలిసి సబితా ఇంద్రారెడ్డికి ఆదివారం వినతి పత్రం చేశారు. రెండు గ్రామాల ప్రజల సౌకర్యార్థం ఈ రోడ్డు వసతి కల్పిస్తే దూరం తగ్గుతుందని అందుకోసం రోడ్డును నిర్మించడానికి కృషి చేయాలని, వారు కోరడంతో వెంటనే ఆమె ఏఈతో మాట్లాడి రోడ్డు నిర్మాణం కోసం ఎస్టిమేషన్ వేయాలని సూచించారు. రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్, మండల సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.