బడంగ్ పేట్, జూలై 6: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దచెరువును ఆదివారం ఆమె పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో పూడిక తీసి వాటి పునర్నిర్మాణం చేసిందన్నారు. అలాగే చెరువు కట్టలు, తూములు, అలుగులను అభివృద్ధి చేసిందన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ చెరువుల అభివృద్ధిని మరిచిందన్నారు.
పెద్ద చెరువులో గుర్రపు డెక్కను కూడా తీయించలేని స్థితిలో సర్కార్ ఉందన్నారు. అలాగే చెరువు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణాన్ని సబితారెడ్డి పరిశీలించారు. క్రీడా ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న వాలీబాల్ కోర్టు, క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్‌ను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా అక్కడి యువకులతో ఎమ్మెల్యే మాట్లాడారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసి క్రీడా ప్రాంగణాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. డీఈ వేణుగోపాల్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, సిద్దాల బీరప్ప, రవీందర్ రెడ్డి, నర్సిరెడ్డి, ప్రవీణ్, రజాక్, మాధవి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.