కందుకూరు, నవంబర్ 25: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, అభివృద్ధిని చేసేందుకు ఓ విజన్ ఉండాలని, ఆ విజన్ ఉన్న నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరూ లేరని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కందుకూరు మండల కేంద్రంలోని సామ నర్సింహారెడ్డి ఫంక్షన్ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి చేయడానికి నాయకులు ఒక విజన్ ఉండాలని అన్నారు.
ఎన్నిల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుంటుంబ సర్వే నిర్వహిస్తుందని, ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తులు ఎటుపోయాయి? అని ప్రశ్నించారు. కందుకూరు, మహేశ్వరం, చేవేళ్ల మండలాలను మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని అన్నారు. మున్సిపాల్టీలను ఏర్పాటు చేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని ఒక వైపు రైతులు భూములు కోల్పోయి ఇబ్బందులు పడతుంటే మరోవైపు ఉపాధి హమీ కూలీలు పని దొరకక అవస్థలు పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి పక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం అభివృద్ధికి రూ. 270 కోట్లు మంజూరు చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూస్తే ప్రజల్లో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. 420 ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందన్నారు. ఏం సాధించారని సంబురాలు చేసుకుంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు మాట తప్పినందుకా..? సంబురాలు చేసుకునేది? అని ప్రశ్నించారు. టీఎస్ ఐఐసీ ద్వారా నిధులు తీసుకవచ్చి ఫార్మా సిటీ భూములు కోల్పోయిన గ్రామాలకు రూ.5 కోట్లకు పైగా మంజూరు చేసి అబివృద్ధి చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఎమ్మెల్యే మండల పరిధిలోని గూడూరు వెళ్తుండగా రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెట్టారు. విషయాన్ని గమనించిన ఆమె రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. రోడ్డుపై ఎందుకు ఆరబెట్టారని, కొనుగోలు, దిగుబడి, రైతు బంధు వస్తుందా? అన్న విషయాలపై వివరాలు తెలుసుకున్నారు. రైతులు వారి సమస్యలను సబితా ఇంద్రారెడ్డికి వివరించారు.
రైతు బంధు రావడం లేదని, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయినట్లు రైతులు పలువురు వివరించారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుక మేఘనాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు కాకి దశరథ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, గుయ్యని సామయ్య, డైరెక్టరు పొట్టి ఆనంద్, జంగయ్యలు పాల్గొన్నారు.