సచివాలయం వద్ద తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలంగాణవాదులు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మంగళవారం నగరంలో పలు చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహాలు, చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. చిత్రంలో మీర్‌పేట చందన చెరువు కట్టపై తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి .
తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకుంటే ఎవరికైనా రాజకీయ సమాధి తప్పదని, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడం సిగ్గుమాలిన చర్య అని తెలంగాణ వాదులు, మేధావులు, బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యను ఖండిస్తూ తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకం చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఆయన పిలుపు మేరకు మంగళవారం నగరంలోని పలు ప్రధాన చౌరస్తాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలకు, చిత్రపటాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తెలంగాణ తల్లికి కేటాయించిన స్థానంలో ఏర్పాటు చేసి.. తెలంగాణ తల్లిని అవమానపరిచిన సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని తెలంగాణ మేధావులు, అభిమానులు పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకున్న వాళ్లెవ్వరైనా రాజకీయాల్లో బతికి బట్టకట్టలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలంగాణ సమాజం హెచ్చరించింది.