బాలాపూర్ వేణుగోపాలస్వామి దేవాలయ భూముల వ్యవహారంపై ‘నమస్తే’ వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. విసృత చర్చకు దారితీసింది. పార్టీలకు అతీతంగా స్థానికులు ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. తమ ప్రాంతంలో ఉన్న పురాతన దేవాలయ భూములను రక్షించడం తమ బాధ్యత అంటూ.. సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి వేణుగోపాలస్వామి భూముల ఆక్రమణ వ్యవహారంపై ఆరా తీశారు. దేవాదాయశాఖ , రెవెన్యూ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే.. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటామన్నారు. ఈ మేరకు అన్ని దేవాలయాల వద్ద భూములకు రక్షణ ఏర్పాటు చేయాలని రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులను ఆదేశించారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ)/బడంగ్‌పేట: బాలాపూర్ వేణుగోపాలస్వామి దేవాలయ భూ ముల వ్యవహారంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. పార్టీలకతీతంగా స్థానికులు విస్తృతంగా చర్చించారు. తమ ప్రాం తంలో ఉన్న పురాతన దేవాలయ భూములను రక్షించడం తమ బాధ్యత అంటూ సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి వేణుగోపాలస్వామి భూముల ఆక్రమణ వ్యవహారంపై ఆరా తీశారు. దేవాదాయశాఖ , రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటామని అందుకోసం అన్ని దేవాలయాల వద్ద భూములకు రక్షణ ఏర్పాటు చేయాలని రెవెన్యూ, ఎండోమెంట్ వారిని ఆదేశించారు.
ఆలయభూమిని వేరొకరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ప్రతిఘటించామని, ఇప్పుడు కూడా ఎవరైనా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ స్థానికులు అంటున్నారు. స్థానికంగా ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో ఈ కథనంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భూముల ధర పెరుగుతుంటే కబ్జాదారులు బాలాపూర్ వైపు చూస్తున్నారని, గతంలో ఉన్న ముఖ్య వ్యక్తి ఒకరు ఈ బేరసారాల వెనుక ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఒక మంత్రి ఆలయభూములపై ఎన్ఓసీ కావాలంటూ దేవాదాయశాఖ అధికారులపై చేస్తున్న ఒత్తిళ్లను కూడా స్థానికులు తప్పుబట్టారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయభూములు ఆలయానికే చెందేలా ఎంత వరకైనా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు సైతం నమస్తే కథనంపై స్పందించారు సోమవారం సర్వేకు సిద్ధమైనట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు. ఆలయభూముల హద్దులను నిర్దారించి వాటికి ఫెన్సింగ్ వేసేందుకు కావలసిన ప్రతిపాదనలను కలెక్టర్‌కు సమర్పిస్తామని దేవాదాయశాఖ నుంచి కూడా సహకారం తీసుకుంటామని రెవెన్యూ అధికారులు చెప్పారు.
అటు దేవాదాయశాఖ ఉద్యోగుల్లోనూ ఈ భూదందా వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భూములను కాపాడడంలో దేవాదాయశాఖకు వస్తున్న సమస్యేంటంటూ స్థానికులు ప్రశ్నిస్తుంటే ఇప్పటివరకు వెలుగుచూడని విషయాలపై చర్చకు దారితీసేలా కథనం ప్రచురించిన నమస్తే తెలంగాణను దేవాదాయ ఉద్యోగులు మెచ్చుకున్నా రు. ఆ శాఖ వాట్సాప్ గ్రూపుల్లో ఈ కథనంపై చర్చ జరగగా.. అందులో భూములను కాపాడే ది శగా ఉన్నతాధికారులు, స్థానికులు, రెవెన్యూ, పోలీసులు సహకరిస్తే వేణుగోపాల స్వామి భూములను పరిరక్షించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది.
ఇదే విషయంపై ఓ మంత్రి ఆలయ భూములపై కన్నేసి తన అనుచరులతో వ్యవహారం నడుపుతుండగా ఆ ఒత్తిళ్లకు దేవాదాయ ఉన్నతాధికారులు భయపడి వెనక్కు తగ్గుతారా అనే గుసగుసలు వినిపించాయి. ముఖ్యంగా ఆ భూములకు సంబంధించి నోఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ దేవాదాయశాఖ కార్యాలయానికి మంత్రికి సంబంధించి వ్యక్తిగత కార్యదర్శితో పాటు ఆయన రక్త సంబంధీకులు స్వయంగా వచ్చి ఒత్తిడి చేస్తుండడంతో అధికారులు భయపడుతున్నట్లు తెలిసింది.
ఈ భూముల వ్యవహారంలో సదరు మంత్రి నేరుగా సంబంధిత శాఖా మంత్రి, పేషి అధికారులతో కూడా మాట్లాడి ఒక కీలక ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఎన్ఓసీ ఇస్తే భూమి కానీ డబ్బులు కానీ ఇవ్వడానికి కూడా చర్చించారని, ఒక్క బాలాపూర్ మాత్రమే కాకుండా బడంగ్‌పేట, అత్తాపూర్ తదితర చోట్ల ఆలయ భూములపై సదరు మంత్రి కన్నేసి ఆయన అనుచరులు, ముఖ్యులతో దేవాదాయశాఖపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆ శాఖలో చర్చిస్తున్నారు.
వేణుగోపాలస్వామి ఆలయభూములను కాపాడడంతో దేవాదాయశాఖదే కీలకపాత్ర. అందులోనూ 6సీ ఆలయం కావడంతో ఆలయ ఆస్తులను పరిరక్షించడానికి బాలాపూర్ మండల ఇన్చార్జిగా ఒక అధికారిని నియమించారు. ఆ అధికారి తాను పనిచేసే పెద్ద దేవాలయం నుంచి చిన్నదేవాలయాల ఆస్తుల పరిరక్షణకు అయ్యే వ్యయాన్ని భరించడంతోపాటు సిబ్బంది కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి వారిని ఆక్రమణలను అడ్డుకోవడంలో చేసే చట్ట పరమైన కార్యకలాపాలకు ఉపయోగించడానికి అవకాశముంటుందని దేవాదాయశాఖ మొదటి నుంచి ఈ తరహ పద్ధతిని పాటిస్తోంది.
ఇదే క్రమంలో వేణుగోపాలస్వామి గుడి భూములు 19.05ఎకరాలను కాపాడడానికి దేవాదాయ అధికారులకు అవకాశముంది. సంవత్సరంన్నర క్రితం ఇదే ఆలయభూముల్లో వేరేవారు ఆక్రమించుకుని షెడ్లు వేస్తే వారిపై బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసి వాటిని కూల్చేసిన దేవాదాయశాఖ అధికారులు ఇప్పుడు ఈ భూముల పరిరక్షణకు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తమ పరిధిలో ఉన్న భూములను రక్షించే బాధ్యత అధికారులకు ఉన్నప్పటికీ వారు మాత్రం ఈ కేసుల చుట్టూ తాము తిరగలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం వందల కోట్ల రూపాయల విలువ చేసే ఈ ఆలయ భూములను పరిరక్షించి వాటి ద్వారా ఏదైనా ఆదాయమార్గాన్ని అన్వేషిస్తే ఆదాయం లేని దేవాలయానికి వైభవం కల్పించినవారవుతారని స్థానికులు కోరుకుంటున్నారు.