బంజారాహిల్స్, జనవరి 29: సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని సీట్లలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఎంపీ స్థానాన్ని గెలిపించుకుంటామని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని లేక్‌వ్యూ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ పరిధిలో సుమారు 4.80 లక్షల ఓట్లు వచ్చాయని, బీజేపీ అభ్యర్థులకు కేవలం రెండున్నర లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీకి ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు బుద్ధి చెప్పారని, మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ఫలితం బీజేపీకి వస్తుందని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి, అర్షద్ నవాబ్, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, మహాలక్ష్మీగౌడ్, వనం సంగీతాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.