కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 10 : ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, కార్యకర్తలకు అండగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్(BRS) పార్టీ కార్పొరేటర్లతో ఎమ్మెల్యే కృష్ణారావు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందదర్భంగా ఆయన మాట్లాడుతూ..నాటి సీఎంకేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ హయాంలో కూకట్పల్లి నియోజకవర్గం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధిని సాధించిందని, కాలనీలు, బస్తీలలో మౌలిక వసతులకు ప్రాధన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేశారన్నారు. పేదలందరికి సంక్షేమ పథకాలు అందయాన్నారు.
రాష్ట్రంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదినెలల కాలంలో పరిపాలించడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామిలను నేరవేర్చడం లేదని విమర్శించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలని జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులను అడిగితే నిధులు లేవని సమాధానం చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
కాలనీలు, బస్తీలలో సమస్యల పరిష్కారం కృషి చేయాలని కోరారు. కార్పొరేటర్లు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారికి ఏమైనా కష్టంవస్తే అండగా ఉండాలన్నారు. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించాలని, పెండింగ్ పనులను పూర్తిచేసేదుకు కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని అధరించిన ప్రజలకు, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అండగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.