కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 27 : ప్రజల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని, పది నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగెత్తిపొయారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాలానగర్ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమన్వమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధిని సాధించిందని, రాష్ట్రం అన్ని రంగాలలో ఆదర్శంగా అభివృద్ధిని చెందిందన్నారు.
సమాజంలోని పేదలందరికి సంక్షేమ ఫలాలు అందాయని, అందుకే నేటికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోవడం లేదన్నారు. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాలనీలు, బస్తీలలో చిన్నిచిన్న ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. నియోజకవర్గంలోని అయా ప్రాంతాలలో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే..ఆ పనులు చేయడానికి నిధులు లేవని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు చెప్పడం బాధకరమన్నారు.
గత పదేండ్లలో నియోజకవర్గంలో వేలాది కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, నేడు చిన్న పనులు కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనమై ప్రజలు విసిగెత్తిపోయారని, రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్రజలందరు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.