కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 3 : కేంద్ర సంస్థలైనా, రాష్ట్ర సంస్థలైనా సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని, అబద్ధాలతో పబ్బం గడుపుతున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సిద్ధమా? అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే గాంధీ ఆరోపణలను ఖండించిన ఆయన.. తన ఆస్తులతో పాటు కాలేజీపై విచారణకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఒక ఎమ్మెల్యే వియ్యంకుడిపై మీడియాలో కథనాలు వచ్చాయని మరి ఆ ఎమ్మెల్యే ఎవరో ఎంక్వైరీ జరుగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉన్నందున ముఖ్యమంత్రికి అప్పీలు చేస్తున్నానని పూర్తి విచారణ జరుపాలని వేడుకుంటున్నట్టు తెలిపారు. రాజకీయాల్లో పిల్లల గురించి మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాత్ర లేకుండానే సర్వే నెంబర్ 57 ప్రైవేట్పరమైందా అని కృష్ణారావు ప్రశ్నించారు. సీలింగ్ ల్యాండ్, మఠం ల్యాండ్, కేపీహెచ్‌బీకాలనీ ల్యాండ్‌లపై విచారణకు సిద్ధమని, గాంధీ ఎస్టేట్ ఎవరిదో విచారణ జరిపిద్దామన్నారు.
ఆయన నియోజకవర్గంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకులను అడ్డుకుంటే తానే దగ్గరుండి అనుమతి ఇప్పించిన విషయాన్ని ఎన్టీఆర్ కుమారులను అడిగితే చెబుతారన్నారు. గాజులరామారం భూమి విషయంలో గాంధీకి వ్యతిరేకంగా హైడ్రా హైకోర్టులో ఎందుకు పోరాడుతున్నదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలది కూల్చితే హైడ్రా కరెక్ట్.. ఎమ్మెల్యే భూముల్ని కూల్చితే హైడ్రా తప్పవుతుందా అది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపైనే ఉన్నదన్నారు. ఒక ఎమ్మెల్యే అయివుండి… ఫ్రీలాంచ్ పేరిట అనుమతి లేని ప్లాట్లను అమ్మిన దొంగ ఎవరని నిలదీశారు.