కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 25 : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కష్టపడి చదివితే..బంగారు భవిష్యత్ ఉంటుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు. ఆదివారం కేపీహెచ్‌బీ కాలనీని చెందిన ఆలీవ్ మిఠాయి సంస్థ అధినేత దొరబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన అకాడమిక్ ఎక్సలెన్సీ(Excellence Award) అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత యేడాది పదో తరగతి వార్షిక పరీక్షలలో 10/10 జీపీఏ పాయింట్స్ సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లక్ష రూపాయల నగదు బహుమతి, ప్రశంస పత్రాలను ఎమ్మెల్యే కృష్ణారావు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించినట్లు తెలిపారు. విద్యార్థులకు ప్రతి యేటా 10వేల మంది విద్యార్థులకు స్కూల్‌బ్యాగ్, నోట్‌బుక్స్, పెన్నులు, డిక్షనరీతో కూడిన పాఠశాల కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు. సొంతంగా, మిత్రులు సహాకారంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు వివరించారు. చదువుకు మించినది ఏది లేదని, విద్యార్థులకు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలన్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం ఎల్లప్పుడు సహకారాన్ని అందిస్తానని తెలిపారు.