కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 24 : కూకట్పల్లి నియోజకవర్గంలోని 9 చెరువులను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని, చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనీ భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. గురువారం కూకట్పల్లిలో హైడ్రా అధికారులతో ఎమ్మెల్యే చెరువులను పరిశీలించి అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..హైడ్రా ఆధ్వర్యంలో కూకట్పల్లిలోని నల్లచెరువు, సున్నం చెరువులను, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కాముని చెరువును అభివృద్ధి చేసే పనులు మొదలు పెట్టారని తెలిపారు.
ఈ పనులు చేసే క్రమంలో.. చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ల పరిధిలోని భూ యజమానులు నష్టపరిహారం ఇవ్వాలని కోరగా… ఈ సమస్యను హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ మేరకు స్పందించిన హైడ్రా కమిషనర్ భూములు కోల్పోతున్న హక్కుదారులందరికి టిడిఆర్ రూపంలో నష్టపరిహారాన్ని అందించరున్నట్లు తెలిపారు. దీనికి భూ యజమానులు కూడా అంగీకారాన్ని తెలిపారని పేర్కొన్నారు. ఆయా చెరువుల పరిధిలో ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాలని, ఎవరికి ఇబ్బంది కలగకుండా పనులు చేస్తే తాను పూర్తి సహకారాన్ని అందిస్తారని తెలిపారు.
నియోజకవర్గంలోని మిగిలిన చెరువులను కూడా అభివృద్ధి చేయాలని కోరారు. గతంలో కొన్ని చెరువులను అభివృద్ధి చేశామని, ఆ చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. చెరువుల అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రతి తెలియదని ఎవరికి నష్టం లేకుండా… బాధితులకు న్యాయం చేస్తూ, చెరువులను అభివృద్ధి వేగవంతం చేయాలని కోరారు.