కేపీహెచ్‌బీ కాలనీ, నవంబరు 26 : ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ అధినేత, తొలి సీఎం కేసీఆర్ సంకల్పాన్ని గుర్తు చేస్తూ ఈ నెల 29 న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. పదేండ్లలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. తెలంగాణ భవన్లో మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా దీక్షా దివస్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ దేశ పటంలో తెలంగాణను ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, ఆయన సంకల్పాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజులలో కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసుకుని తెలంగాణ రాష్ర్టాన్ని పురోగతి వైపు నడిపించుకోవాలన్నారు. ఇందుకోసం ఈ నెల 29 వ తేదీన దీక్షా దివస్‌ను దిగ్విజయం చేయాలని , ఉద్యమ స్ఫూర్తిని చాటుకోవాలని ఎమ్మెల్యే కృష్ణారావు కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.