కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 19 : సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలి. రాబోయే ఎన్నికల్లో తిరిగి మూడోసారి గులాబీ జెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. బుధవారం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి చేరాయన్నారు.
సంక్షేమంతో పాటు అభివృద్ధే లక్ష్యంగా లక్షల కోట్ల వ్యయంతో అనేక పథకాలను అమలు చేసి వాటిని నేరుగా లబ్ధిదారులకే అందేలా సీఎం కేసీఆర్ పాలన అందించారని పేర్కొన్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొన్న ఘనత కేంద్రంలోని బీజేపీ, గతంలో పాలించిన కాంగ్రెస్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆ రెండు పార్టీలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఈ నెల 25న నియోజకవర్గంలో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రతి కార్యకర్త పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.