గోల్నాక, నవంబర్ 23 : పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్(Kalyana Lakshmi) పథకాలను నాడు కేసీఆర్ ప్రభుత్వం పెట్టిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh )తెలిపారు. శనివారం అంబర్‌పేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తహసీల్దార్ మీరాబాయి, కార్పొరేటర్లు విజయ్ కుమార్‌గౌడ్, బి. పద్మావెంకట్‌రెడ్డి తదితరులతో కలసి 182 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డకు పెద్దన్న నిలువాలని కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల వివాహాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.