హైదరాబాద్ : చైనా మాంజ(Chinese manja) పట్టిస్తే రూ.5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్( MLA Danam Nagender)ప్రకటించారు. చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని దానం అన్నారు. ముఖ్యంగా మెడ, ముఖం, చేతులకు ప్రాణాంతక గాయాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా పక్షులు, విద్యుత్ తీగలు, ప్రజా ఆస్తులకు కూడా భారీ నష్టం జరుగుతోందన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరైన చైనా మాంజను విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఏ షాపులో అయిన చైనా మాంజ అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తా మన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, వారికి తన నుంచి ఐదు వేల నగదు బహుమతిగా ఇస్తానని దానం నాగేందర్ ప్రకటించారు.