బంజారాహిల్స్,నవంబర్ 4: సంక్షేమ పథకాల్లో వడ్డించిన విస్తరిలా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కుక్కలు చింపిన విస్తరిలా మారిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. శనివారం బంజారాహిల్స్ రోడ్ నం. 11లోని లేక్ వ్యూ బంజారా ఫంక్షన్హాల్లో వెంకటేశ్వరకాలనీ డివిజన్ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కోలేటి దామోదర్, బీఆర్ఎస్ సీనియర్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ సమావేశానికి హాజరై మాట్లాడారు.
తెలంగాణలో పేదలకు అవసరమైన అనేక సంక్షేమ పథకాలను తెచ్చింది తామేనని, రానున్న ఎన్నికల్లో మరోసారి వచ్చేది కూడా తామేనన్నారు. పదేండ్లలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సుమారు 60 పథకాలు తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు, ఆరు గ్యారెంటీలంటూ కాంగ్రెస్ చేస్తున్న హడావిడిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ఓటర్లకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తల పైనే ఉన్నదని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు. ఇటీవల అన్ని సర్వేలలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని తేలిందన్నారు.ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి, ఫైజల్ జాబ్రీ, మాజీ కార్పొరేటర్ భారతీనాయక్, డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్, బాబానాయక్, రాంచందర్, సారంగపాణి, వెంకటస్వామి పాల్గొన్నారు.