ఖైరతాబాద్/బంజారాహిల్స్, సెప్టెంబర్ 4 : ఖైరతాబాద్‌లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో దశాబ్దాలుగా వేధిస్తున్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. సోమవారం ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో ఎస్ఎన్డీపీ, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. పనులకు సంబంధించిన మ్యాప్‌ను తెచ్చుకొని పరిశీలించారు. ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లోని వరద నీటిని తరలించేందుకు ఓ బాక్స్ డ్రైన్ ఏర్పాటు చేసి తద్వారా నీటిని లేక్ పార్కులోని ప్రస్తుతం రూ.3కోట్లతో వెంటనే పనులను ప్రారంభిస్తున్నామని, రాబోవు రోజుల్లో చుక్క నీరు కూడా నిలబడదన్నారు. ఈ పనులు పూర్తయితే ఇక్కడ వీడీసీసీ రోడ్లను వేయిస్తామన్నారు. మొదటి విడత డబుల్ బెడ్రూం గృహాల పంపిణీలో సుమారు 12వేల మంది లబ్ధిదారులకు అందించారని, ఖైరతాబాద్ నియోజకవర్గానికి 5వేల నుంచి 6వేల వరకు డబుల్ బెడ్రూంలు కేటాస్తున్నారని, అర్హులైన వారందరికీ ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నదని, ఆ పార్టీకి పేద ప్రజల సమస్యలు పట్టవన్నారు. ప్రజలు చెప్పుడు మాటలు వినవద్దని, గతంలో ప్రజలు బుద్ధ్ది చెప్పారని, ఈ సారి మళ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ ఈఈ రత్నాకర్, వాటర్ వర్క్స్ జీఎం షరీప్, మేనేజర్ నదీమ్, జీహెచ్ఎంసీ డీఈ చైతన్య, ఏఈ చరణ్, ఈఈ ఇందిరా, బీఆర్ఎస్ నాయకులు మహేందర్ బాబు, కేవీ ప్రసాద్, ప్రవీణ్ కుమార్, రాజు, బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్, జ్ఞానేశ్వర్, కిశోర్ కుమార్ పాల్గొన్నారు.
కాగా జీహెచ్ఎంసీ ఖాళీ స్థలంలో నిర్మాణ వ్యర్థాలను డంపింగ్ చేసిన సురేష్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సురేష్ అనే వ్యక్తి కొంతకాలంగా తమ ఇంటికి సమీపంలో భవన నిర్మాణం చేస్తున్నాడని, తన ఇంటి కోసం తవ్విన మట్టితో పాటు భారీగా నిర్మాణవ్యర్థాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా డంపింగ్ చేయడంతోనే గోడ కూలి తమకు నష్టం వాటిల్లిందని స్థానిక మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
‘
భారీ వర్షం కారణంగా జీహెచ్ఎంసీకి చెందిన పార్కు స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీగోడ కూలడంతో దెబ్బతిన్న ఇండ్లను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 11లోని గౌరీశంకర్ కాలనీలోని రామాలయం సమీపంలో జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో కొంతమంది అక్రమంగా మట్టిని డంపింగ్ చేయడంతో ప్రహరీ గోడపై ఒత్తిడి పడింది. ఆదివారం కురిసిన వర్షంతో మట్టిబరువు మొత్తం గోడపై పడడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. పక్కనున్న అపార్ట్‌మెంట్‌తో పాటు మూడు ఇండ్ల మీద శిథిలాలు పడడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ం జోనల్ కమిషనర్ వెంకటేష్‌తో కలిసి ఘటనా స్థలంలో పరిశీలించారు. సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఘటనలో దెబ్బతిన్న ఇండ్లకు గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం చేయిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.