ఎల్బీనగర్, అక్టోబర్ 27: రేవంత్‌రెడ్డి.. ఏనాడైనా ఎల్బీనగర్ను పట్టికున్నాడా! అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విమర్శించాడు. ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతు మూగబోయిందని, ప్రశ్నించే గొంతునే ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఐదేండ్లలో ఏ ఒక్క అభివృద్ధికి ఎంపీ నిధులు ఇవ్వకుండా కేవలం రాజకీయాల కోసమే రేవంత్‌రెడ్డి మాట్లాడారని తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో ప్రశ్నించే గొంతు పేరుతో ఎన్నికైన రేవంత్‌రెడ్డి ప్రజలను పట్టించుకోలేని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన నాయకుడు ఓ పార్టీ అధ్యక్షుడైతే ఎంత ఘోరంగా ఉంటుందో ప్రస్తుతం స్పష్టం అవుతోందన్నారు.
తప్పు చేసిన వారికి పార్టీ పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఎంపీ రేవంత్‌రెడ్డి ఎక్కడా ఏ ఆపదలోనూ కనిపించలేదని, కరోనా సమయంలో, వరదల సమయంలో కనీసం ప్రజలను పరామర్శించలేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల కళ్లబొల్లి మాటలను నమ్మొద్దని కోరారు. కర్ణాటక రైతులు కొడంగల్‌లో తమ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ ప్రచారం చేస్తున్నారంటేనే కాంగ్రెస్ హామీల అమలు తీరు స్పష్టం అవుతోందన్నారు. కరోనా మొదటి దశలో ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నప్పుడు, రెండో దశలో మరింత తీవ్రంగా ఉండి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నప్పుడు కూడా ఎంపీ పట్టించుకోలేదని, వరదల సమయంలోనూ కానరాలేదని ఆరోపించారు. కరోనా కష్టాల్లో తొలుత శానిటైజర్లను లింగోజిగూడలో తయారు చేయించి పంపిణీ చేశామని, మార్కెట్లను షిఫ్ట్ చేయించారని, అన్ని రకాలుగా అందుబాటులో ఉండి సేవలు అందించామన్నారు. అంబులెన్స్ చార్జిలు తగ్గించామని, ఆస్పత్రుల్లో బెడ్లు ఇప్పించడంతో పాటు శ్మశాన వాటికల చార్జిలను తగ్గింపజేసి ప్రజలకు మేలు చేశామన్నారు. ప్రజాప్రతినిధిగా రేవంత్‌రెడ్డి ఏ ఆపద సమయంలోనూ పట్టించుకోలేదని, ప్రతి ఆపద సమయంలోనూ బీఆర్ఎస్ శ్రేణులే ముందంజలో ఉండి ప్రజలకు అండగా నిలిచారన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా, గెస్ట్ అప్పియరెన్స్ కోసం వస్తున్న నాయకులను తరిమికొట్టాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలు విజ్ఞులు, విద్యావంతులు, చైతన్య వంతులని గెస్ట్ ఆర్టిస్టులకు ఎల్బీనగర్లో తావు లేదన్నారు. ప్రజలు లోతుగా అధ్యయనం చేసి అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలన్నారు. ఈ ప్రాంతం కాని వారు పోటీ చేసి గెల్చినా ఈ ప్రాంతంపై చిత్తశుద్ధి ఉండదన్నారు. గెస్ట్ నాయకులు ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత తమ ప్రాంతాలకు పోయి ఈ ప్రాంతాన్ని పట్టించుకోరన్నారు. ఎల్బీనగర్ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులు ఎన్నికల కోసమే వస్తున్నారని విమర్శించారు. మరో నాయకుడు ఒక ప్రాంతంలో ఎన్నికై ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతాన్నే సుస్థిరం చేసుకోకుండా మరో ప్రాంతానికి రావడం శోచనీయమన్నారు. ఎల్బీనగర్ ప్రాంతంపై కొందరు దొంగ ప్రేమ నటిస్తున్నారని, గతంలో ఎమ్మెల్యేగా ఆర్.కృష్ణయ్య, ఎంపీగా రేవంత్‌రెడ్డి గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి సమయం ఇవ్వకుండా పట్టించుకోలేదన్నారు. ఎల్బీనగర్ ప్రాంతంపై చిత్తశుద్ధి ఉండి 365 రోజులు ప్రజల్లో ఉండి సేవలు అందిస్తున్న నాయకులనే ప్రజలు ఆదరించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించకపోవడం దివాళాకోరుతనమన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ పత్తా లేకుండా పోయిందని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ నాయకులు ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధిపై, నియోజకవర్గానికి చేయాల్సిన పనులపై దృష్టి పెట్టకుండా కేవలం వ్యక్తిగత నిందారోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రతిపక్షాలు సంపూర్ణంగా విఫలమయ్యాయన్నారు. కళ్లబొల్లి మాటలు, అసత్య ఆరోపణలు చేసే పార్టీలను ప్రజలు దూరం పెట్టాలన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. రెట్టించిన ఉత్సాహంతో బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేస్తోందని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. గత ఐదేండ్లకు ప్రస్తుతానికి ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధిలో సమూల మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా 1080 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో హస్తినాపురం, చంపాపేట, నాగోలు ఆనంద్‌నగర్‌లో నూతన ఫ్లై ఓవర్లు రానున్నాయన్నారు. గడ్డిఅన్నారంలో టిమ్స్ ఆస్పత్రి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇవి కాక మరో 2 యూపీహెసీలు అందుబాటులోకి రానున్నాయని.. మూసీ ప్రక్షాళన మొదలయ్యిందని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.3,718కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. వరదల సమయంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో చేపట్టిన నాలా అభివృద్ధి పనులతో వరద ముంపు నుంచి కాలనీల ప్రజలు గట్టెక్కాయన్నారు. నియోజకవర్గానికి విశ్వనగర హంగులు సమకూరాయన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు జీవీ సాగర్‌రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, నాయకులు రాగిరి ఉదయ్ గౌడ్, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.