మేడ్చల్, డిసెంబర్2 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉన్న ప్రాంతాల్లో అరకొర నీటి సరఫరాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు, మూడు రోజులకోసారి అదికూడా కేవలం అర్థగంట పాటే మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో మా పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఔటర్ అవతల ఉన్న మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకర్గాలకు చెందిన 104 గ్రామాలకు తాగునీటి ఎద్దడిని నివారించేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతిరోజు నీటిని సరఫరా చేసేవారు.
ఘన్పూర్ గుట్ట నుంచి ప్రత్యేక లైన్ల ద్వారా గ్రామాలకు తాగునీటిని తరలించారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌లో సీన్ మొత్తం తారుమారు అయ్యింది. ఆయా గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిని రెండు నుంచి మూడు రోజులకోకసారి మాత్రమే అరగంట పాటే సరఫరా చేస్తున్నారు. ఈ సీజన్లో వర్షాలు విస్తారంగా కురిసి ప్రాజెక్టుల్లో సరిపడా నీరు ఉన్నప్పటికీ కృతిమ నీటి ఎద్దడిని సృష్టిస్తున్నారాని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే గతంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలన్నీ మున్సిపాలిటీల పరిధిలో చేరగా ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీలన్న జీహెచ్ఎంసీలో విలీనం అయిన విషయం తెలిసిందే.
నీటిని మళ్లిస్తున్నారని ఆరోపణలు..!
ఎలాంటి అనుమతులు లేకుండా మిషన్ భగీరథ నీటిని శామీర్‌పేట్‌లోని లియోనియో రిసార్ట్‌కు తరలించడం వల్లే మేడ్చల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో నీటి ఎద్దడి త్రీవమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. మిషన్ భగిరథ నీటి పైపులైన్‌కు లింకు చేసి లియోనియో రిసార్టుకు నీటిని తరలిస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రైతు సంఘం సభ్యుడు రవికిరణ్‌రెడ్డి యాస్కి ప్రమోద్‌గౌడ్ ఆరోపించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. తమ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసి తాగునీటి ఎద్దడిని నివారించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో రోజూ వచ్చేవి
బీఆర్ఎస్ హయాంలో ప్రతిరోజు భగీరథ నీళ్లు వచ్చేవి.. ఇప్పుడు రావడం లేదు. అదికూడా రెండు మూడు రోజులకోసారి కేవలం అర్థగంటపాటు మాత్రమే వదులుతన్నారు. కనీసం తాగునీరు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. అధికారులు స్పందించి రోజూ సరిపడా తాగునీటిని విడుదల చేయాలి.
– లత, ఉప్పర్‌పల్లి
కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు
మిషన్ భగీరథ నీటిని లియోనియో రిసార్టుకు మళ్లించడం వల్లే మా ప్రాంతాలకు నీటిఎద్దడి ఏర్పడింది. రిసార్టుకేమో 18 ఇంచుల పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేసి మా ప్రాంతాలకు తక్కువ ఇంచుల పైపులైన్‌తో నీరు సరఫరా చేసి కృతిమ నీటి ఎద్దడి సృష్టిస్తున్నారు. ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు నీటి సరఫరా జరిగేది.
– రవికిరణ్‌రెడ్డి, బొమ్మరాసిపేట్
అరకొర సరఫరాతో ఇబ్బందులు
ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసినప్పటికీ మిషన్ భగీరథ నీటిని అరకొర సరఫరా చేస్తున్నారు. భగీరథ పథకం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి ఎద్దడి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తే ఇప్పుడు మళ్ల్లీ అదే పరిస్థికి వచ్చింది. మిషన్ భగీరథ పైపులైన్ల నుంచి ఇతరత్రా అవసరాలకు నీటిని మళ్లించినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
– ప్రమోద్‌గౌడ్, బాబాగూడ