మేడ్చల్,నవంబర్ 7: ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్ తాగునీటి కోసం తల్లడిల్లింది. గొంతు తడుపుకోవడానికి గుక్కె డు నీరు కరువై అల్లాడింది. అడుగంటిన భూగర్భ జలా లు, అంతంత మాత్రంగా వర్షాలు, పెరుగుతున్న జనాభాతో కరువు తాండవించింది. నియోజకవర్గంలోని పల్లె, పట్టణం ‘కన్నీ’రు పెట్టింది. ఒక్క రోజు కష్టం కాదది. ముప్పై, నలబై ఏండ్ల కష్టం. స్వరాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో మేడ్చల్ గొంతు తడిపారు. 2014 మేలో బాధ్యతలు చేపడితే 2016 ఏప్రిల్ వరకు దాదాపు రెండేండ్లలో ఆడపడచుల బాధలు తీర్చారు.
జనవరి నుంచే…
మేడ్చల్ నియోజకవర్గంలో నీళ్ల బాధలు ప్రతి ఏటా జనవరి నుంచే ప్రారంభం అయ్యేవి. భూగర్భ జలాలు అడుగంటి, బోర్లలో నుంచి చుక్క నీరు వచ్చేది కాదు. దీంతో ప్రజలు ఒక్కో ట్యాంకర్‌కు రూ.500 నుంచి రూ.600 వరకు చెల్లించి, నీటిని కొనుగోలు చేయాల్సి వచ్చేది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, దాతలు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటి కోసం మహిళలు బిందెలతో బారులు తీరేవారు. ట్యాంకర్ల వద్ద పానిపట్టు యుద్ధాలు జరిగేవి. ఖాళీ బిందెలతో ప్రజలు రోడ్డెక్కేవారు. ఈ కష్టాలన్ని గోదారమ్మ రాకతో తీరిపోయాయి.
రూ.279 కోట్ల వ్యయంతో..
జంట నగరాల నీటి అవసరాల కోసం మేడ్చల్ మండలం రాజబొల్లారం పంచాయతీ ఘన్‌పూర్‌లో క్షేత్రగిరిపై నిర్మించిన మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజ్వరాయర్ నుంచి మేడ్చల్ మున్సిపాలిటీ, మండలాలకు నీటిని తీసుకెళ్లేందుకు ప్రధాన పైపులైన్, అంతర్గత పైపులైన్, సంప్‌లు, ఓహెచ్‌బీఆర్‌లు, బీపీటీ, ఓహెచ్ఆర్ఎస్ల నిర్మాణానికి రూ.279.25 కోట్ల వ్యయం చేశారు. రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు మేడ్చల్ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం వెనుక 1000 కేఎల్ సామర్థ్యంతో రెండు సంప్‌లను నిర్మించారు. వీటిలో ఒకటి మున్సిపాలిటీకి కేటాయించగా, మరొకదాన్ని మేడ్చల్, కుత్బుల్లాపూర్ మండలాలకు నీటిని అందించేందుకు కేటాయించారు.
ఈ సంప్ ద్వారా ఆయా మండలాల్లోని గ్రామాలకు నీటి సరఫరా చేసేందుకు డబిల్‌పూర్‌లో 40 కేఎల్ సామర్థ్యంతో ఒక ఓహెచ్‌బీఆర్, 120 కేఎల్ సామర్థ్యంతో గిర్మాపూర్‌లో మరో ఓహెచ్బీఆర్ను నిర్మించారు. ఘన్పూర్ ఎంబీఆర్ నుంచి శామీర్‌పేటకు నేరుగా, ఘట్కేసర్, కీసర మండలాలకు నీటిని సరఫరా చేసేందుకు 200 కేఎల్ సామర్థ్యంతో ఒక బీపీటీని కీసర మండలం భోగారంలో నిర్మిస్తున్నారు. ఈ ట్యాంకులు, ప్రధాన పైపులైన్ల నిర్మాణం, పంప్‌హౌజ్, నీటిని తోడే పంప్‌ల ఏర్పాటు కోసం 160 కోట్లు ఖర్చు చేశారు.
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలు, వార్డులకు నీటి సరఫరా చేసేందుకు అంతర్గత పైపులైన్, వోహెచ్ఆర్ఎస్ల నిర్మాణం కోసం రూ.44.50 కోట్లు, మండలంలోని వివిధ గ్రామాల్లో ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులు, పైపులైన్‌కు రూ.14.50 కోట్లు, శామీర్‌పేట మండలానికి రూ.31.87 కోట్లు, కీసర మండలానికి రూ.5.68 కోట్లు, ఘట్కేసర్కు రూ.13.13 కోట్లు, కుత్బుల్లాపూర్ మండలానికి రూ9.57 కోట్లు మొత్తం రూ.119.25 కోట్లు వ్యయం చేశారు.
ఇంటింటికీ నీటి సరఫరాలో కోసం అంతకు ముందున్న వోహెచ్ఆర్ఎస్లను వినియోగించడంతో పాటు కొత్తగా 66 వరకు ఓహెచ్ఎస్ఆర్(ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్)లను నిర్మించారు. మేడ్చల్ మున్సిపాలిటీతో పాటు ఐదు మండలాలలకు నీటిని అందించేందుకు 256.18 కిలో మీటర్ల ప్రధాన పైపులైన్‌ను నిర్మించారు. ఇందులో 125 కిలో మీటర్లు మేడ్చల్ మున్సిపాలిటీలో ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 240 కిలో మీటర్ల పైపులైన్‌ను నిర్మించారు.
95 ప్రాంతాలకు ప్రయోజనం
నియోజకవర్గ పరిధిలో చేపట్టిన మిషన్ భగీరథతో 95 ప్రాంతాలకు ప్రయోజనం చేకూరింది. ఘట్కేసర్ మండలంలో రింగురోడ్డుకు ఆవల ఉన్న 17 గ్రామాలు, కీసరలో 12 గ్రామాలు, మేడ్చల్‌లో 35 గ్రామాలు, శామీర్‌పేటలో 31 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుంది. నియోజకవర్గంలో రింగురోడ్డుకు అవతలి వైపు ఉన్న గ్రామాలు, మేడ్చల్ పట్టణం దాహార్తిని మిషన్ భగీరథ ద్వారా తీరగా, రింగురోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, గ్రామాలకు జల మండలి(హెచ్ఎండబ్ల్యూఎస్) నీటిని అందిస్తుంది. గుండ్లపోచంపల్లి, తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్, పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపాలిటీలు జల మండలి ఇంటింటికీ నీటిని అందించేందుకు భారీ నీటి వ్యవస్థను నిర్మించింది.