Miss World 2025 Pagent | సిటీబ్యూరో, మే 12 ( నమస్తే తెలంగాణ) : ‘ఓ మై గాడ్… ఇట్ ఈజ్ సో హాట్.. ఐ డీన్ట్ ఎక్స్పెక్ట్ ఇట్… ఐ విష్ ఐ హ్యాడ్నాట్ కమ్.’ అంటూ ప్రపంచ అందాల భామలు ఔట్‌డోర్ టూర్లపై పెదవి విరుస్తున్నారు. భానుడి భగభగలకు సుందరీమణులు ఇబ్బందులుపడుతున్నారు. వందలాది కిలో మీటర్ల ప్రయాణం వారికి చికాకు తెప్పిస్తున్నట్టు చర్చించుకుంటున్నారు. మండుటెండల్లో వందలాది కిలో మీటర్ల ప్రయాణానికి వాళ్లంతా వెనకడుగు వేస్తున్నారు. టూర్లకు తాము రాబోమని నిర్వాహకులకు చెప్పేస్తున్నారని ఓ అధికారి ‘నమసే’్తకు తెలిపారు. అందుకే మొదట్లో కంటెస్టెంట్లందరితో పర్యాటక టూర్‌కు ప్రణాళికలు చేసిన అధికారులు.. ఇప్పుడు వాళ్ల అనాసక్తి కారణంగా కొందరిని మాత్రమే టూర్‌కు తీసుకెళుతుండటం విశేషం. సోమవారం 120 మందిలో 22 మందిని మాత్రమే నాగార్జున సాగర్ బుద్దవనం టూర్‌కు తీసుకెళ్లారు.
రాష్ట్రంలో భానుడి భగభగలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన కంటెస్టెంట్స్‌తో దూర ప్రయాణాలను పర్యాటక శాఖ ప్లాన్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈనెల 31న హైటెక్స్‌లో ఫైనల్ పోటీలు జరుగుతాయి. ప్రపంచ సుందరీ ఎవరో ఆ రోజే తెలిసిపోతుంది. 17 రోజుల సమయం మాత్రమే ఉంది. కాగా, పోటీలకు సంబంధించిన రౌండ్లు 22న మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే ఉంటుంది. 23న హెడ్ టూ హెడ్ చాలెంజ్ ఫినాలే, 24న ఫ్యాషన్ ఫినాలే ఉంటుంది. ఈ స్వల్ప కాలంలో వాళ్లంతా టైటిల్ దక్కించుకోవడానికి తీవ్ర కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో పర్యాటక శాఖ సుదూర ట్రిప్పులు ప్లాన్ చేశారు.
మంగళవారం హైదరాబాద్‌లోని హెరిటేజ్ వాక్ ఉండగా, మరుసటి రోజున వరంగల్, 15న పోచంపల్లి సందర్శన ఉండనున్నది. కాగా మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ హెరిటేజ్ వాక్, డిన్నర్ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌహముల్లాప్యాలెస్లో డిన్నర్ నేపథ్యంలో మదీనా – చార్మినార్ – శాలిబండ – ఓల్గాజంక్షన్ – మూసబౌలి వయా ఖిలావత్ రోడ్ వరకు వెళ్లే అన్ని మార్గాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు.