బంజారాహిల్స్, నవంబర్ 4: మైనారిటీల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాయమాటలు చెప్పినా వారంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలకు చెందిన సుమారు 300 మంది మహిళలు మాజీ కార్పొరేటర్ షఫీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి వినయ్‌భాస్కర్ పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
బీఆర్ఎస్ హయాంలో మైనారిటీల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారన్నారు. షాదీ ముబారక్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, విదేశీ విద్యకు స్కాలర్షిప్ తదితర పథకాలతో ప్రయోజనాలు అందాయన్నారు. మైనారిటీ డిక్లరేషన్ అంటూ మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనారిటీలందరూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ను గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారని వివరించారు.