రామచంద్రాపురం, నవంబర్ 6 : సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం లబ్ధ్దిదారుల బాధలను రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలు రాగానే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మంత్రులు నిమగ్నమయ్యారు. ఓటర్లను కలిసి కాకా పడుతున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. మురుగు, తాగునీటి సమస్యలు, పిల్లల చదువు, చెత్త సమస్య, కరెంటు సమస్యలతో నానాయాతన పడిన నివాసితులపై ఇప్పుడు అధికారిపార్టీకి ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రజలు భావిస్తున్నారు.
నాయకుల ప్రేమ కొల్లూరులో జూబ్లీహిల్స్ ఓటర్లున్న ఫేజ్‌లోనే ఉందని, మిగతా ఫేజ్‌లలో ఉంటున్న ఇతర నియోజకవర్గాల ప్రజలకు కూడా ఓటు వేసే రోజు వస్తేనే వారి బ్లాకులను పట్టించుకుంటారేమోనని ప్రజలు అంటున్నారు. కేవలం ఓటర్ల కోసమే ఆత్మీయతను చాటుతుండటం చర్చనీయంశంగా మారింది. గురువారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు డబుల్ బెడ్రూం సముదాయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్వీయ సమ్మేళనం నిర్వహించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై కొల్లూరు డబుల్బెడ్రూం నివాసితులపై ఎక్కడలేని ఆత్మీయతను కనబర్చి హామీల వర్షం గుప్పించారు. కొల్లూరు ఫేజ్-2లోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో 67వేల మందికి కొత్త రేషన్‌కార్డులు ఇచ్చామని తెలిపారు. కొల్లూరు ఫేజ్-2లో వారం రోజుల్లో 10 కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రూ. 2 కోట్ల 40లక్షల వాటర్ బిల్లులు ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో సన్నబియ్యం ఇస్తున్న ప్రభుత్వం తమదేనని తెలిపారు. మైనారిటీ సంక్షేమం, సామాజిక సమానత్వానికి పాటుపడుతామన్నారు. మీరు తమకు మద్దతు ఇవ్వండి మేము మీతో ఉంటామని ఓటర్లతో అన్నారు. అనంతరం డబుల్బెడ్రూం వద్ద తిరిగారు.