హైదరాబాద్ : కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని పశు సంవర్ధకశాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్‌పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్థులకు అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో షూలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధన జరగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ‘మన బస్తీ – మన పాఠశాల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.7200 కోట్లను కేటాయించారన్నారు. మొదటి విడతలో 33శాతం పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అమీర్‌పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ.90లక్షల విడుదల చేసినట్లు వివరించింది. వీటితో పాఠశాల భవనం మరమ్మతులు, పెయింటింగ్, టాయిలెట్స్ నిర్మాణం, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించడం, ఫర్నీచర్‌ను కొనుగోలు చేయడం వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.
ఇవే కాకుండా విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రి, సాంస్కృతిక ప్రదర్శనలకు కావాల్సిన పరికరాలు, దుస్తులు వంటివి అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలలలో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని 15 రోజుల్లో అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. తాను దత్తత తీసుకుంటున్న పాఠశాలను రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థులు తమ విద్యను ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగించే విధంగా చేయూతను అందిస్తున్న అగర్వాల్ సమాజ్ నిర్వహకులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో అనుభవం కలిగిన టీచర్స్ ఉన్నారని, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా యూనిఫాం, పుస్తకాలను అందిస్తున్నదని మంత్రి తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందుగా కనకదుర్గమ్మ దేవాలయంలో అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యూరీఫైడ్ వాటర్ కూలర్‌ను మంత్రి ప్రారంభించారు.