సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ) ;పెంచిన గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ.. రెండో రోజు శుక్రవారం సైతం బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరును ఎండగట్టారు. మోదీ హటావో.. దేశ్ బచావో అంటూ మరోసారి నినదించారు. పలు నినాదాలతో కూడిన ప్లకార్డులు, వినూత్న కార్యక్రమాలతో రోడ్డెక్కారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. జేబీఎస్ వద్ద మ్ంరత్రి తలసాని, కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బడంగ్‌పేటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వివిధ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, నేతలు నిరసనల్లో పాల్గొన్నారు.
2024లో బీజేపీ పతనం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను పెంచడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో మంత్రి తలసాని పాల్గొని ప్రధాన రహదారిపై పొయ్యి పెట్టి వంటలు వండారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు, స్థానిక మహిళలతో కలిసి నినదించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని హెచ్చరించారు. ఇప్పటివరకు 8 సార్లు సిలిండర్ల ధరలను పెంచిన ప్రభుత్వం పేదలపై ఆర్థిక భారం మోపుతున్నదన్నారు. ప్రభుత్వ సంస్థలను అదానీ, అంబానీకి కట్టబెట్టి యువతకు ఉద్యోగాలు లేకుండా చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలతో సబ్బండ వర్గాలకు అండగా నిలుస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నదన్నారు. 2014లో సిలిండర్ ధర రూ.410లు ఉంటే 1,155 రూపాయలకు పెంచి దేశాన్ని పాలించే నైతిక హక్కును కోల్పోయారని విమర్శించారు. కంటోన్మెంట్ రోడ్లను మూసివేస్తూ స్థానికులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఏప్రిల్ 30న జరిగే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కోసం వచ్చే బీజేపీ నేతలను నిలదీయాలని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మ న్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున హజరయ్యారు.
పోరాటం ఆపేదే లే..
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను దించే వరకు పోరాటం ఆపేది లేదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం బడంగ్‌పేట బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఆధ్వర్యంలో అల్మాస్గూడ నుంచి బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ వరకు పాదయాత్రగా వచ్చి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి కట్టెల పొయ్యిపై వంటావార్పు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చమురుతో పాటు గ్యాస్ ధరలను పెంచిన మోదీ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ప్రధాన మోదీ తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తుండటం భావ్యం కాదన్నారు. దేశంలో ఏ వర్గం వారికోసమైనా ఓ కొత్త పథకం తెచ్చారా అని ప్రశ్నించారు. బీజేపీని గద్దె దింపితేనే సామాన్యుల సమస్యలకు పరిష్కారం దొరకడం ఖాయమన్నారు. . బీజేపీకి ఓటేస్తే అధోగతి పాలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్జున్, ఏనుగు రాంరెడ్డి, లిక్కి మమత కృష్ణారెడ్డి, బీమిడి స్వప్న జంగారెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి, పెద్దబావి శోభాఆనంద్‌రెడ్డి, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, రోహిని రమేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.