బడంగ్‌పేట, అక్టోబర్ 29: మహేశ్వరం నియోజకవర్గాన్ని ఒక విజన్‌తో అభివృద్ధి చేశానని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై మాట్లాడుతూ… మారోసారి మహేశ్వరం నుంచి గెలిపిస్తే బాధ్యతగా పనిచేస్తానన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 491 పరిశ్రమలు తీసుకొచ్చామని తెలిపారు. దీంతో ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు.
గొలుసుకట్టు చెరువులను సుందరీకరణ చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతున్నామని చెప్పారు. నియోజకవర్గంలో మౌలిక వసతులకు పెద్దపీట వేశామన్నారు. రాబోయేది బీఆర్ఎస్ అని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోను చూసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు దిమ్మ తిరిగిందన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వస్తున్న వారిని నమ్మొద్దని సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టానికి చేసింది శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు అర్జున్, దీపిక, స్వప్న వెంకట్‌రెడ్డి, స్వప్న, లలిత, ప్రసన్న , బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.