బడంగ్‌పేట, జూలై 14 : తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ పార్టీ ఏం చేసిందో బస్తీకొస్తున్న ఆ పార్టీ నాయకులను నిలదీసి అడగాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చా రు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి అయోద్యనగర్, హుడా కాలనీ, ఎస్ఎన్నెస్ కాలనీ-2, ఓల్డ్ బాలాజీ నగర్లో రూ.1.24కోట్లతో సీసీ రోడ్డు, మినీ వాటర్ ట్యాంక్, డ్రైనేజీ, ఓపెన్ జిమ్ పార్కులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.65లక్షలతో రెడ్డి బ్యాటరీ నుంచి సాయి బాబా గుడి మీదుగా ఎస్‌ఆర్‌డీజీ పాఠశాల వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతామని అన్నారు. రూ.78లక్షలతో అంబేద్కర్ విగ్రహం నుంచి అల్మాస్గూడ కమాన్ వరకు సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు 24గంటల విద్యత్‌ను అందిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకు కండ్లు మండుతున్నాయో అర్థం కావడం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు కరెంటు ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ తీరని అన్యాయం చేస్తుందన్నారు. ప్రజలందరు బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను గమనించాలన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలి అని అన్నారు. మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలో ముంపు సమస్య లేకుండా చేస్తామని తెలిపారు. ప్రత్యేక ట్రంక్‌లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. మురుగు నీరు చెరువుల్లోకి వెళ్లకుండా చేస్తామని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో రూ.40 కోట్లతో చెరువులను సుందరీకరణ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్, డీఈ గోపీనాథ్, ఏఈ శ్రీనివాసులు, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.