బడంగ్‌పేట / మహేశ్వరం, నవంబర్ 25 : అక్కగా ఆదరించండి, చెల్లిగా చేరదీయండి.. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విద్యాశాఖ మంత్రి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల, మోహబత్ నగర్, తుమ్మలూరు, ఎన్డీ తండా, కేసీ తండా, మహేశ్వరం టౌన్, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2, 3, 4, 5, 24, 25, 26వ డివిజన్లతో పాటు మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12, 13, 29, 30, 31, 32, 33, 34, 35, 36 డివిజన్లలో మంత్రి రోడ్ షో నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో ప్రజలు గులాబీ పువ్వులు చల్లుతూ మంత్రికి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీతో తెలంగాణ రాష్ర్టానికి ఒరిగేది ఏమిలేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ర్టానికి న్యాయం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, బీజేపీ వస్తే మతం, కులం అంటూ చిచ్చు పెడుతరు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నదా అని ప్రశ్నించారు. కరోన, వరద సమయంలో ప్రజలు కష్టాలతో అల్లాడుతుంటే పత్తాలేని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇవ్వాల ఓట్ల కోసం ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని మండిపడ్డారు. గతంలో వర్షాలతో కాలనీలు మునిగి పోయి ప్రజలు అల్లాడుతుంటే బీజేపీ నాయకులు ట్రాక్టర్లలో తిరిగి పోయారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నాయకులు మోకాళ్ళలోతు నీటిలో ప్రజలతో కలిసి సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఆపదలో ఉన్న వారిని ఓదార్చ కుండా ట్రాక్టర్లలో తిరిగి పోయిన వ్యక్తులకు ఓట్లు వేస్తారా? ప్రజలతో కలిసి నడిచిన సబితమ్మను గెలిపిస్తారా..? నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తారా? చుట్టపు చూపుగా వచ్చి ఓట్లు వేసుకునే వాళ్లుకు ప్రధాన్యత ఇస్తారా..? ప్రజలు ఆలోచన చేయాలన్నారు. చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కాలనీలను బంజారాహిల్స్‌కు ధీటుగా అభివృద్ధి చేయిస్తానని చెప్పారు.
కాంగ్రెస్ అభ్యర్థికి మహేశ్వరం సరిహద్దులు తెలుసా..?
కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి మహేశ్వరం సరిహద్దులు తెలుసా అని మంత్రి సబితారెడ్డి ప్రశ్నించారు. తాండూరు, మేడ్చల్‌లో చెల్లని రూపాయి మహేశ్వరంలో ఎలా చెల్లుతుందని అన్నారు. తాండూరు సీటు అడిగితే మహేశ్వరం ఇచ్చిండ్రు తనకు ఇష్టం లేదని అభ్యర్థి చెప్తున్నాడు.., అలాంటి వ్యక్తి ఇక్కడ ఉంటాడా..? ఓట్లు అయిపోయిన తెల్లారే ఎవరూ కనిపించరన్నారు. డబ్బుల సంచులతో వస్తున్న వారు నాయకులను కొని రాజకీయం చేయాలని చూస్తున్నారని, ప్రజలు గమనించాలన్నారు.
చేసిన అభివృద్ధి మీ కండ్లముందరే ఉన్నది
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓట్లు వేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు ప్రతి మహిళలకు మూడు వేలు ఇవ్వడంతో పాటు 93 లక్షల తెల్లరేషన్ కార్డు దారులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలోని తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలు, బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.832 కోట్లతో ట్రంక్‌లైన్, నాలాల అభివృద్ధి, వరద ముంపు సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. రూ.280 కోట్లతో తాగునీటి సమస్య, రూ.40కోట్లతో 11 చెరువుల సుందరీకరణ, 13 బస్తీ దవాఖానలు, 8 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 30న బీఆర్ఎస్కు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఇన్చార్జి ఎంపీపీ సునితాఅంద్యానాయక్, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, తుక్కుగూడ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, మహేశ్వరం బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజునాయక్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేశ్ గౌడ్, శ్రీనునాయక్, రవినాయక్, తదితరులు ఉన్నారు.