రూ.కోటితో డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, మే 24: భవిష్యత్తులో సరస్వతీ నిలయంగా మహేశ్వరం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండాలో రూ.కోటి వ్యయంతో డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నానని అన్నారు. మన ఊరు-మన బడితో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తున్నామని అన్నారు. ఉన్నత చదువులకు వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే విద్యను అభ్యసించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కందుకూరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని చెప్పారు. ఫార్మా యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని, 57 కంపెనీలు రూ.3వేల కోట్ల పెట్టుబడులతో వచ్చాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు డిగ్రీ కళాశాల మంజూరు చేస్తే ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించారని ఆమె తెలిపారు.
భవనం లేక బడంగ్పేట్లో ఏర్పాటు చేస్తే అబద్దం ప్రచారం చేశారన్నారు. డిగ్రీ కళాశాలతో పాటు వంద పడకల ఆసుపత్రిని తీసుకు వస్తున్నామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామని అన్నారు. బీజేపీ నాయకులకు చేతనైతే కేంద్రం నుంచి విద్యాలయాలను తీసుకు రావాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణకు ఒక్క విద్యాసంస్థను కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఐఐఎం, ఐఐటీ, నవోదయ పాఠశాలలు, ఐఐఐటీలు, గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు తీసుకురావాలని బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని, వీటిని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి తీసుకురావాలని బీజేపీ నాయకులకు సూచించారు. మహేశ్వరానికి ఇటీవల వచ్చి పచ్చి అబద్దాలను మాట్లాడి పోయారని అన్నారు. మహేశ్వరంలో రోడ్డు వెడల్పునకు సహకరిస్తున్న గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులకు, ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచెపాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్డీవో వెంకటాచారి తాసీల్దార్ ఆర్పీ జ్యోతి, ఎంపీడీవో నర్సింహులు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంగోత్ రాజూనాయక్, కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆథిల్ అలీ, సర్పంచులు మోతీలాల్ నాయక్, కరోళ్ల ప్రియాంక రాజేశ్, మెగావత్ రాజూ నాయక్, కంది అరుణ రమేశ్, మంత్రి రాజేశ్, స్లీవారెడ్డి, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, దోమ శ్రీనివాస్‌రెడ్డి, ఎంఏ. సమీర్, ఎస్కే ఆజాం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జంగయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్, ఎస్టీసెల్ అధ్యక్షుడు గోపాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే
మహేశ్వరం, మే 24: తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సహకార సంఘం కార్యాలయం వద్ద వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, సహకారబ్యాంక్ చైర్మన్ మంచెపాండు యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇతర రాష్ర్టాల్లో రెండు పంటలను కొంటున్న కేంద్రం.. తెలంగాణ రైతులు పండించిన వరి పంటలను కొనకుండా కక్ష్య సాధింపు చర్యలు చేస్తుందని అన్నారు.
256మందికి చెక్కులు పంపిణీ
మహేశ్వరం, మే 24: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి కొండంతఅండ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డితో కలిసి 256మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులతో పాటు సొంతగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఇంటి పెద్దగా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని అన్నారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లవాడు పుడితే రూ.12వేలను అందిస్తున్నామని అన్నారు.