జూబ్లీహిల్స్,మార్చి 2: నవజాత శిశువు నుంచి ఐదేండ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు నేడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో పోలియో చుక్కలకు దూరమైన పిల్లలకు పకడ్బందీగా ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మూడు జిల్లాల్లో కమ్యూనిటీ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, అపార్ట్మెంట్లతో పాటు ప్రధానంగా ఇతర రాష్ర్టాల నుంచి, జిల్లాల నుంచి మైగ్రేట్ అవుతున్న పిల్లల కోసం రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పల్స్ పోలియో శిబిరాలు నిర్వహించనున్నారు. ఆదివారం నాంపల్లి నియోజకవర్గంలోని చింతల్‌బస్తీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 8 గంటలకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.