కులం కొట్లాట లేదు.. మతం, ప్రాంతం పంచాయతీ లేదు.. ప్రజా సంక్షేమమే నమూనాగా సీఎం కేసీఆర్ సమర్థపాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఇలాంటి నమూనానే మున్ముందు కొనసాగించేందుకు ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి ఆశీర్వదించాలని కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ స్థాయి పార్టీ బూత్ కమిటీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శనివారం మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో ప్రభుత్వ విప్ గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు ఢిల్లీ అధిష్ఠానం చేతిలో కీలుబొమ్మలని విమర్శించారు. రాజకీయం కోసం అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నారని, బీఆర్ఎస్ పొత్తు మాత్రం ప్రజలతోనేనని స్పష్టం చేశారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థి అరెకపూడి గాంధీని అధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
– మియాపూర్, నవంబర్ 4
మియాపూర్ , నవంబర్ 4 : కుల, మత, ప్రాంత కొట్లాటల్లేకుండా ప్రజా సంక్షేమమే నమూనాగా సీఎం కేసీఆర్ అహరహం కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి నమూనానే మున్ముందు కొనసాగించుకునేందుకు ఈ ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ తోడ్పాటును అందించాలన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ స్థాయి పార్టీ బూత్ కమిటీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శనివారం మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో ప్రభుత్వ విప్ గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేక ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రధాని, అగ్రనేతలు, పక్క రాష్ర్టాల సీఎంలు తెలంగాణకు వరుస పెడుతున్నారని, వారి పాచికలు ఇక్కడ చెల్లవని అన్నారు. 60 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినా అభివృద్ధి ఏమాత్రం జరగలేదన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అనతి కాలంలోనే విశేషమైన అభివృద్ధికి నోచుకున్నదన్నారు. నగరంలో ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వందలాది కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఇదంతా సీఎం కేసీఆర్ సమర్థ పాలనకు తార్కాణమన్నారు. ఎమ్మెల్యే టికెట్ల కోసం ఢిల్లీకి పరుగులు తీసే ప్రతిపక్ష నేతలు అధిష్టానం చేతులో కీలబొమ్మలని, రాజకీయాల కోసం ప్రతిపక్షాలు అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నాయని అన్నారు. కానీ బీఆర్ఎస్ పొత్తు మాత్రం ప్రజలతోనేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావటం ఖాయమన్నారు.దేశంలోనే పెద్ద నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థి అరెకపూడి గాంధీని అధిక మెజార్టీతో గెలిపించుకుని అసెంబ్లీకి పంపాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ. 9 వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని, ప్రజల మద్దతుతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తామని చెప్పారు.
అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందించానని నియోజకవర్గ ప్రజలు మరోసారి తనకు అవకాశం కల్పించి విజయాన్ని అందించాలని, సేవకుడిలా పని చేస్తానని విప్ గాంధీ స్పష్టం చేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లద్దె నాగరాజు సహా పలువురు మంత్రి కేటీఆర్ ,విప్ గాంధీల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, మంజులరెడ్డి, రోజాదేవి, దొడ్ల వెంకటేశ్ గౌడ్ , ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస్‌రావు, జూపల్లి సత్యనారాయణ, సింధురెడ్డి సహా పార్టీ డివిజన్ అధ్యక్షులు సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.