‘రాష్ట్రంలో కులం పేరుతో కుంపట్లు.. మతం పేరుతో మంటలు.. ప్రాంతాల పేరుతో పంచాయితీలు పెట్టలేదు… అభివృద్ధే కులం..సంక్షేమమే మతంగా సీఎం కేసీఆర్ పని చేశారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో గురువారం జరిగిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్‌లో కరెంటు కష్టాలు లేవని.. తాగునీటి కష్టాలుతీరాయన్నారు. ప్రతిరోజూ తాగునీటిని ఇవ్వడమే లక్ష్యమని త్వరలోనే 24 గంటలు తాగునీటిని అందిస్తామని హామీనిచ్చారు. కాంగ్రెస్ గతమని.. బీఆర్ఎస్తోనే భవిష్యత్ అని పునరుద్ఘాటించారు. వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కొచ్చి జీవిస్తున్న వారంతా తెలంగాణ బిడ్డలేనని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు, స్థానిక ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్లను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
– కేపీహెచ్‌బీ కాలనీ/కుత్బుల్లాపూర్, నవంబర్ 16
కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 16 : తెలంగాణ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని.. హైదరాబాద్ నగరం బాగుంటేనే తెలంగాణ బాగుంటుందని.. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో అభివృద్ధి, సంక్షేమం ఆగొద్దంటే.. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలుపు కోసం నిర్వహించిన రోడ్ షోకు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ హాజరయ్యారు. జేకే హోటల్ చౌరస్తా, మూసాపేట మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా, కేపీహెచ్‌బీ కాలనీ టెంపుల్ బస్టాప్, బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాల వద్ద మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తొమ్మిదిన్నరేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో పనిచేసింది ఆరున్నరేండ్లేనని.. కరోనా కారణంగా మూడేండ్లు అభివృద్ధి సాగలేదని, తక్కువ కాలంలోనే నగరంలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, పార్కులు, రోడ్లు నిర్మించామని, డ్రైనేజీ, తాగునీటి వంటి సమస్యలన్నింటినీ పరిష్కరించామని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది కొంతేనని.. చేయాల్సింది ఎంతో ఉందన్నారు.
కూకట్‌పల్లిలో తాగునీరు, కరెంటు కష్టాలను తీర్చింది.. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నది బీఆర్ఎస్ పార్టీయేనని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో ఎవరినీ బాధపెట్టలేదని, ఎవరికీ ఇబ్బంది కలిగించలేదని ప్రాంతీయ, కులమత బేదం లేకుండా ప్రజలందరినీ సమానంగా చూసినట్లు తెలిపారు. రోడ్‌షోలో కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, కార్పొరేటర్లు సబీహాగౌసుద్దీన్, శిరీషాబాబూరావు, మందడి శ్రీనివాస్‌రావు, జూపల్లి సత్యనారాయణ, ఆవుల రవీందర్‌రెడ్డి, పండాల సతీశ్‌గౌడ్, ముద్దం నర్సింహయాదవ్, మహేశ్వరీశ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కులం పేరుతో కుంపట్లు.. మతం పేరుతో మంటలు.. ప్రాంతాల పేరుతో పంచాయితీలు పెట్టలేదని.. అభివృద్ధే కులం.. సంక్షేమమే మతంగా సీఎం కేసీఆర్ పని చేశారన్నారు. వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కొచ్చి జీవిస్తున్న వారంతా తెలంగాణ బిడ్డలేనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కరెంటు కష్టాలు లేవని.. తాగునీటి కష్టాలు తీరాయని నాడు పవర్ హాలీడేస్లు ఉండేవని నేడు 24 గంటల కరెంటుతో జనరేటర్లు, ఇన్వర్టర్లు మాయమయ్యాయన్నారు. ప్రతిరోజూ తాగునీటిని ఇవ్వడమే లక్ష్యమని..భవిష్యత్‌లో 24 గంటలు తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గతమని.. బీఆర్ఎస్ భవిష్యత్ అని..కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలతో తల్లడిల్లి పోయామని.. కాంగ్రెస్ వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుందని హెచ్చరించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లవేళలా ఉండే మాధవరం కృష్ణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరి సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని ఎమ్మెల్యే కృష్ణారావును గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటేయ్యాలని.. మూడోసారి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు.
కుత్బుల్లాపూర్ జోన్ బృందం, నవంబర్16:ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా కుత్బుల్లాపూర్‌కు మెట్రోలైన్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఐడీపీఎల్ చౌరస్తాతో పాటు షాపూర్‌నగర్ చౌరస్తాలో జరిగిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు సమన్వయంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు మెట్రోమార్గంతో పాటు అవసరమైన చోట్ల ఫైఓవర్లు, విశాలమైన రోడ్లను అభివృద్ధి చేసేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు. సూపర్‌మ్యాక్స్ కార్మికులు ఇటీవలే తన వద్దకు వచ్చి తమ బాధను వ్యక్తం చేశారని, వారికి శాశ్వత పరిష్కారం చూపేందుకు, అవసరమైన మరో కొత్త కంపెనీని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.