గురువారం 26 నవంబర్ 2020
Hyderabad - Oct 29, 2020 , 08:50:11

10 రోజులు పారిశుధ్య పనులు

10 రోజులు పారిశుధ్య పనులు

  • యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు 
  • 3 లక్షల మందికి రూ.300 కోట్ల పరిహారం
  • ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి కేటీఆర్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వరద విపత్తుతో నగరంలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు పది రోజుల పాటు పారిశుధ్య డ్రైవ్‌ చేపట్టాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, డైరెక్టర్‌ సత్యనారాయణ, జీహెచ్‌ఎంసీ, జల మండలి, విద్యుత్‌ శాఖ, మెట్రో రైల్‌, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ అధికారులతో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా 4లక్షల కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని, ఒక్కో ఫ్యామిలీకి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం రూ. 400 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఇప్పటివరకూ 3లక్షల మందికి పరిహారం అందించినట్లు పేర్కొన్నారు. మరో 37వేల రేషన్‌ కిట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. నగరంలో 1,577 ప్రాంతాలు తీవ్ర ప్రభావితం కాగా, 230 కాలనీలు, బస్తీలు పూర్తిగా నీట మునిగాయన్నారు. బాధితులెవరికైనా పరిహారం అందకపోతే జీహెచ్‌ఎంసీ అధికారులను సంప్రదించాలని సూచించారు.

రెండున్నర రెట్లు అదనపు వ్యర్థాలు

మామూలు రోజుల్లో నగరంలో డైలీ 5,500 మెట్రిక్‌ టన్నుల మున్సిపల్‌ వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ ద్వారా సేకరిస్తుండగా, వరదల కారణంగా రెండున్న రెట్లు పెరిగి 10 వేల మెట్రిక్‌ టన్నులకు చేరుకుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గత 4 రోజుల్లోనే 18 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను తరలించామన్నారు. 100 అదనపు వాహనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని, నాలాల్లో పూడిక, పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని సంబంధిత శాకల అధికారులు ఆదేశించారు. ఎంటమాలజీ విభాగం ద్వారా 64 వెహికల్‌ మౌంటెడ్‌ వాహనాలు, వెయ్యి స్ప్రేయర్లు, 843 నాప్తల్‌ స్ప్రేయర్లతో డిస్‌ఇన్‌ఫెక్షన్‌ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

రోడ్ల పునరుద్ధరణ

వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రహదారులు, ైప్లెఓవర్ల పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రూ.52 కోట్లతో 99 కిలోమీటర్ల మేర అంతర్గత రోడ్లు, 83 కిలోమీటర్ల సీఆర్‌ఎంపీ రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. సీసీ రోడ్ల నిర్మాణాలకు మంజూరు చేసిన రూ.204 కోట్లలో.. రూ.80 కోట్లతో వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. బాక్స్‌ డైయిన్ల నిర్మాణానికి కేటాయించిన రూ.298కోట్లతో వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

హుస్సేన్‌సాగర్‌ పటిష్టతకు ప్రత్యేక కమిటీ

హైదరాబాద్‌కు కంఠాభరణంగా ఉన్న హుస్సేన్‌సాగర్‌ చెరువు కట్ట పటిష్టత, హుస్సేన్‌సాగర్‌లోకి వచ్చే నాలాల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించేందుకు నీటి పారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌ (ఈఎస్‌సీ) నేతృత్వంలో ప్రత్యేక కమిటీని మంత్రి ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్‌ఎండీఏ సంబంధిత శాఖల చీఫ్‌ ఇంజినీర్లు సభ్యులుగా ఉండే ఈ కమిటీ 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని కేటీఆర్‌ ఆదేశించారు. ఇటీవలి వర్షాలకు గ్రేటర్‌లో 14 చెరువులు దెబ్బతిన్నాయని, 6 చెరువులకు గండ్లు పడ్డాయని తెలిపారు. రూ.41 కోట్ల జీహెచ్‌ఎంసీ నిధులతో మరమ్మతులు చేపట్టాలని సూచించారు. హిమాయత్‌ సాగర్‌ గేట్లెత్తడంతో మూసీకి చేరిన వ్యర్థాలను తొలగించడానికి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

రూ.3కోట్లతో ఆజంపురా బ్రిడ్జి   

భారీ వరదల వల్ల కూలిపోయిన ఆజంపురా బ్రిడ్జిని తిరిగి నిర్మించేందుకు రూ.3కోట్లు విడుదల చేశారు. వేగంగా నిర్మాణం పూర్తిచేసి పాత బస్తీ ప్రజల ఇబ్బందులు తప్పించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. అసంపూర్తిగా ఉన్న ట్యాంక్‌బండ్‌ సర్‌ ప్లస్‌ నాలా పనులను పూర్తికి కేటాయించిన రూ.68 కోట్లతో పనులు చేపట్టాలని ఆదేశించారు.

రికార్డ్‌ సమయంలో విద్యుత్‌ పునరుద్ధరణ

డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు మినహా 221 ట్రాన్స్‌ఫార్మర్లకు సరఫరాను పునరుద్ధరించినట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. వరద విపత్తుతో టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌కు రూ. మూడున్నర కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. జల మండలికి 900కి పైగా ఫిర్యాదులందగా, వెంటనే పరిష్కరించినట్లు తెలిపారు. తాగునీటికి సమస్య లేకుండా నగర ప్రజలకు రోజూ 520 ఎంఎల్‌డీల నీటిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక గ్రేటర్‌ శివారులోని 15 మున్సిపాలిటీల్లో నీట మునిగిన 130  కాలనీల్లోనూ సహాయక, పునరుద్ధరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు చెప్పారు.