Minister KTR | భారీ వర్షాలు కురిసినా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో నానక్‌రామ్‌గూడలోని కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో వరదలు, పారిశుధ్యంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అన్నిశాఖల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షాల కారణంగా ప్రాణనష్టం జరగకూడదన్న లక్ష్యంతో అధికారులు పనిచేయాలని ఆదేశించారు.