సిటీబ్యూరో, అక్టోబరు 2 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రం వచ్చిన 76 ఏండ్లలో దళితుల ఉద్ధరణకు, అభ్యున్నతికి పాటుపడిన ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇది పరిపాలన దక్షత కలిగిన ఆయనలాంటి నాయకుల వల్లే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దళిత కుటుంబాలకు లబ్ధిచేకూర్చడంతో పాటు నగర ప్రజలకు మరింత మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడానికి ఈ మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్ కార్టింగ్) వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
హుస్సేన్‌సాగర్ తీరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కన సోమవారం సిల్ట్ కార్టింగ్ వాహనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. మహాత్ముడు చూపిన బాటలో కుల, మతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారన్నారు. తర్వాత రాష్ట్రంలో ఎలాంటి ఘర్షణలు లేకుండా పరిపాలన సాగిస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
486 మందికి ప్రత్యక్ష ఉపాధి
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తన దార్శనికత, ముందు చూపుతో ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారని, అందులో దళితబంధు విప్లవాత్మకమైనదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జలమండలి పరిధిలో పనిచేసేందుకు 162 సిల్ట్ కార్టింగ్ వాహనాలను దళితులకు అందించామని, దీని వల్ల ఒక్కో వాహనానికి ముగ్గురు చొప్పున 486 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. ప్రతి వాహనానికి జలమండలి పని కల్పిస్తుందని, డ్రైవర్, నిర్వహణ, సిబ్బంది ఖర్చులను సైతం జలమండలే చెల్లిస్తుందని వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని మానవ ప్రయత్నాలకు తోడుగా యంత్రాల వినియోగాన్ని పెంచామని మంత్రి కేటీఆర్ వివరించారు.
నేటి నుంచి అందుబాటులోకి
నాలుగు జిల్లాలకు చెందిన 162 వాహనాల్లో హైదరాబాద్‌కి సంబంధించి 88 వాహనాలు మంగళవారం నుంచే అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఏయే సెక్షన్, ఏరియాలో పనిచేయాలో జలమండలి అధికారులు లబ్ధిదారులకు తెలిపారని చెప్పారు. మిగతా జిల్లాల వాహనాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, జలమండలి ఈడీ డాక్టర్ ఎం. సత్యనారాయణ, ఇతర డైరెక్టర్లు , అధికారులు పాల్గొన్నారు.
బాధ్యతగా పనిచేయండి : ఎండీ దానకిశోర్
జలమండలికి 162 సిల్ట్ కార్టింగ్ వాహనాలు కావాలని మంత్రి కేటీఆర్ వద్ద ప్రతిపాదించినప్పుడు వాటిని దళితబంధు పథకం కింద అందించాలని సూచించారని జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు. దళితబంధు పథకంతో సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి అని నిరూపించుకున్నారని కొనియాడారు. ఈ వాహనాల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులే డ్రైవర్, సిబ్బంది అయితే వారికి నిర్వహణ ఖర్చులు పోను నెలకు రూ. 97 వేల ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.
కార్మికులు సురక్షితంగా పనిచేసేందుకు రూ. 3వేల విలువ గల భద్రతా పరికరాల్ని అందిస్తామని తెలిపారు. ఇప్పటికే వీరికి రెండు రోజులు శిక్షణ ఇచ్చామన్నారు. ఈ వాహనాల ద్వారా హైదరాబాద్ నగర ప్రజలకు పారిశుద్ధ్య సేవలు మరింత మెరుగ్గా అందుతాయని ఆశిస్తున్నామన్నారు. కార్మికులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేసి బోర్డుకు, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని ఎండీ ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.