తెరిపివ్వని వానతో నగరం తడిసి ముద్దయింది. మూడు రోజులుగా ఒక్కటే ముసురు.. అయితే మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నగర పరిస్థితులపై మంత్రి కేటీఆర్ బుధవారం నానక్‌రాంగూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు వచ్చినా.. నగరంలో ప్రాణనష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సిద్ధంగా ఉండాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఎప్పటికప్పుడు లక్ష్యాలను చేరుకుంటూ మరింత మెరుగవ్వాలని సూచించారు. మరో వైపు సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. వానకాలంలో వచ్చే వ్యాధుల నేపథ్యంలో అన్ని బస్తీ దవాఖానల్లో 134 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నారు.
సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ ) : భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. బుధవారం నానక్‌రాంగూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో హైదరాబాద్ నగర పరిస్థితులు, పారిశుద్ధ్యం పై పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జోనల్ అధికారులతో కలిసి మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రానున్న రెండు, మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.
ముఖ్యంగా జలమండలి, విద్యుత్‌శాఖ, హైదరాబాద్ రెవెన్యూ శాఖ, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను సైతం ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకొని సంసిద్ధంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఈ మేరకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రధాన రహదారుల వంటి చోట్ల డీ వాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా నాలాలను బలోపేతం చేయడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సంవత్సరం ఇబ్బందులు తప్పుతాయన్న విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వర్షాలతో ప్రాణనష్టం జరగకూడదన్న ఏకైక లక్ష్యంతో పనిచేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
Hyd6
అత్యంత ప్రాధాన్యతగా పారిశుద్ధ్య నిర్వహణ
హైదరాబాద్ నగర పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి మంత్రి కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. నగర పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తున్నదని, దీంతోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరం వేగంగా విస్తరించడం, జనాభా పెరగడం వంటి అంశాలతో నగరంలో చెత్త ఉత్పత్తి పెరుగుతున్నదని, ఈ మేరకు పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళికలను సైతం ఎప్పటికప్పుడు నిర్దేశించుకుంటూ ముందుకెళ్లాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా అధికారులు తమ తక్షణ, స్వల్ప కాలిక పారిశుద్ధ్య ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌కు వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ఇదే అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించి ఆ దిశగా పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్, జోనల్ కమిషనర్లు మమత, శ్రీనివాస్ రెడ్డి, పంకజ, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.