Minister KTR | ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. జీవో 118 కింద రెగ్యులరైజ్ చేసిన పట్టాలను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాల రెగ్యులరైజేషన్‌లో ఎమ్మెల్యే దేవిరెడ్డి కృషి ఎంతో ఉందని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో జీవో నెం.58, 59 కింద లక్ష పైచిలుకు కుటుంబాలకు పట్టాలు వస్తేనే ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే 11 వేల పైచిలుకు పట్టాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
ఎల్బీనగర్, మేడ్చల్, రాజేంద్ర నగర్, కార్వాన్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని 44 కాలనీల్లో భూములకు సంబంధించి వివాదాలున్నాయి. ఆయా చోట్ల ప్రైవేటు వ్యక్తులు వెంచర్లు చేసి ప్లాట్లను విక్రయించారు. కొందరు ఇండ్లను కూడా నిర్మించుకున్నారు. అయితే 1998 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 22ఏ(నిషేధిత భూముల) జాబితాలో కొన్ని సర్వే నంబర్లను చేర్చింది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆయా సర్వే నంబర్లలోని భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేసింది. అప్పటికే కొన్నింటికి రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ వాటిపై హక్కులేకుండా పోయింది. ఈ కారణంగా నిర్మాణాలు జరగక, అభివృద్ధికి అధికారుల నుంచి అనుమతులు లేక సౌకర్యాలు కరువయ్యాయి. ఎన్నో ఏండ్లుగా అక్కడి ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం చేసుకుంటున్నప్పటికీ బిడ్డల వివాహాలకు, కొడుకుల చదువులకు బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే పరిస్థితి లేక ఇంటి యజమానులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. పదిహేను ఏండ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే తమ సమస్యను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్‌ను స్థానికులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ రిజిస్ట్రేషన్ల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్ మానవతా దృక్పథంతో భూ క్రమబద్ధీకరణ కోసం గత ఏడాది నవంబర్‌లో జీవో 118ను విడుదల చేశారు.
జీవో 118 ప్రకారం ఒక్కొక్కరికి గరిష్టంగా వెయ్యి గజాల వరకు నిర్మాణాలతో కూడిన స్థలాన్ని క్రమబద్ధీకరించారు. ఇందుకోసం గజానికి రూ.250 చొప్పున నామమాత్రపు ఫీజును వసూలు చేశారు. అలా క్రమబద్ధీకరించిన స్థలాలకు సంబంధించిన పట్టాలను ఇవాళ మంత్రి కేటీఆర్ లబ్ధిదారులకు అందజేశారు.
శ్రీనిధి కాలనీ, మల్లికార్జున హిల్స్, మారుతీనగర్ కాలనీ, శ్రీనిధి కాలనీ, జనార్దన్‌రెడ్డి నగర్, మారుతీనగర్, ఈస్ట్ మారుతినగర్, అవంతి కాలనీ, మాధవనగర్ కాలనీ, మల్లారెడ్డి కాలనీ, రాజిరెడ్డి నగర్, ఎస్వి కాలనీ, వినాయకనగర్, బాలాజీనగర్, శ్రీరామహిల్స్, వివేకానందనగర్, రాగాల ఎన్క్లేవ్, పద్మావతి నగర్, కమలానగర్, సీఆర్ ఎన్క్లేవ్, గణేశ్‌నగర్, లలితానగర్ నార్త్ కాలనీ, ఈశ్వరిపురం కాలనీ, జైపూర్ కాలనీ, కో ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, సాయినగర్, ఎస్కేడీ నగర్, శ్రీరామ్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వైదేహినగర్, శ్రీపురం కాలనీ, సాగర్ కాంప్లెక్స్, విజయ్‌నగర్ కాలనీ, సీబీఐ కాలనీ, సామనగర్ కాలనీ, కాస్మోపాలిటన్ కాలనీ, బ్యాంకు కాలనీ.